అమరావతిపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

విభజిత ఎపి సర్కార్ లో ఆయన పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి విశ్రాంత ఐఏఎస్ గా వున్న ఐవైఆర్ కృష్ణారావు రాజధాని ఎవరిదీ ? అనే పుస్తక రచన చేశారు. రైతు బాంధవుడిగా పేరొందిన మాజీ మంత్రి, వడ్డే శోభనాధీశ్వర రావు కి అంకితం ఐవైఆర్ అంకితం ఇచ్చారు. తెలుగు ఆంగ్ల భాషల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులమీద విడుదల అయిన ఈ పుస్తకం తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఒక సంచలనంగా చర్చను లేవనెత్తబోతుంది. అసలు ఐవైఆర్ రాసిన పుస్తకంలో ఏముంది ? పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు చెప్పింది ఏమిటి ? వారిమాటల్లోనే ఇచ్చే ప్రయత్నం తెలుగు పోస్ట్ పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తుంది.
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఏమన్నారంటే ...
నలభై నాలుగేళ్ల తరువాత వడ్డే శోభనాధీశ్వర రావు గారితో ఒకే వేదిక పంచుకునే అవకాశం ఐవైఆర్ నాకు కల్పించడం సంతోషంగా వుంది. ఆయన నేను ఆంధ్రా ఉద్యమంలో 32 రోజులు విశాఖ జైలులో ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేసి నప్పుడు నా సహా జైలు మెట్. అప్పటికే ఆయన మంచి నాయకుడు. ఎమ్యెల్యే కూడా. ఆయన తెన్నేటి విశ్వనాధం గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఒక వేదిక మీద కలిసాం. ఆ తరువాత ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు అందువల్ల వల్ల దూరంగానే వున్నాం. రైతులపక్షాన ఆయన చేసిన కృషి మరువలేం. ఇక ఈ పుస్తక ఆవిష్కరణకు పవన్ కళ్యాణ్ చేతుల మీద జరగడం మరింత సంతోషం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం ఢిల్లీ లో అవిశ్వాసం వరకు వెళ్ళింది అంటే పవన్ కల్యాణే కారణం. ఆయన చెపితేనే గా అవిశ్వాసం సర్రున వెళ్ళింది. పవన్ చాలా రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కి అండగా అందరు నిలబడాలి. మనకోసం పోరాటం చేస్తానని ఒకరు వచ్చానంటే ఏ పార్టీ వారైనా ఆయనవెనుక ఉండాలి.
ఐవైఆర్ నిప్పులాంటి మనిషి ...
ప్రభుత్వంలో ఉండగా ఐవైఆర్ ఎప్పుడు రహస్యాలు నాతో పంచుకోలేదు. మీతో ఏమి చెప్పినా టివిలో పెట్టేస్తారనేవారు. ఆయనకు బాధ వస్తే నాతో పంచుకోవడం అలవాటు. అలా అని ఆ బాధ ఏమిటో పూర్తిగా చెప్పేవారు కాదు. ఇక ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించి రిటైర్ అయ్యాక నిజం ప్రజలతో పంచుకోకపోతే ఆయనకన్నా పాపి ఎవరు వుండరు. తప్పు జరుగుతూ వుంది అని తెలిసి కూడా దాన్ని ఇప్పుడు చెప్పకపోతే ఆయన అందరికన్నా ఎక్కువ పాపి అవుతారు. ఆయన పుస్తకం విడుదల అవుతుంది అంటే భయపడుతున్నారు అంటే ఆయన నిజం చెబుతున్నారని అర్ధం. నిజం చెప్పినప్పుడే కోపం వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఈ పుస్తకాన్ని అత్యధికgగా కొని చదవండి. అలా పుస్తకం బాగా ప్రజల్లోకి వెళుతుంది అని రచయిత గ్రహిస్తే మరిన్ని అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
ాజధాని వ్యాపారం కోసమా ..?
క్యాపిటల్ అంటే పెట్టుబడి. రాజధాని అనేది వ్యాపారం కోసం పెట్టె పెట్టుబడిలా చేయకూడదు. కేంద్రం రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ ఏమి చెప్పింది ? ఆ కమిటీలో వున్న సభ్యులు దేశంలో ఒక్కోరంగంలో అత్యున్నత ప్రతిభావంతులైన అధికారులు. అది కాదని మన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. నారాయణ, గల్లా జయదేవ్, వంటి వారితో వున్న కమిటీ అది. క్యాపిటలిస్ట్ లతో క్యాపిటల్ కమిటీ. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మీరు త్యాగం చేశారన్నారు. త్యాగం అంటే ఏమిటి ? త్యాగం అంటేనే మీకు అర్ధం అయ్యివుంటుంది. దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులు అని ఎందుకన్నారు ? ఒక్కసారి నెట్ లోకి వెళ్ళండి. బర్మా నూతన రాజధాని న్యాపీడా చూడండి. ఇప్పుడు బర్మాను మయన్మార్ గా పేరు మారింది. 2005 లో నిర్మించిన ఈ రాజధానిని రంగూన్ నుంచి మార్చి కట్టారు. దీన్ని ఇప్పుడు అంతా ప్రపంచవ్యాప్తంగా ఘోస్ట్ సిటీ అని పిలుస్తారు. యూరప్ నుంచి ఇటీవలే ఒక జంట ఆ రాజధానికి వెళ్ళింది. అక్కడ అంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు చూడండి. ఆ సిటీలో ఉండటానికి అక్కడ జనం భయపడుతున్నారు. మన అమరావతికి 33 వేల ఎకరాలు సేకరిస్తే న్యాపిడా కోసం 32 వేలఎకరాల్లో నిర్మించారు. అక్కడి ఫోటో లు చూస్తే ఆ నగరంలోని భవనాలు మన గ్రాఫిక్స్ తో సరిగ్గా సరిపోతాయి. మన రాష్ట్రానికి దానికి జనాభాతో సహా సరిగ్గా సరిపోతుంది. మిలట్రీ ఆ నగరాన్ని నిర్మించి అక్కడికి ప్రజలను బలవంతంగా తరలించాలని చూసినా కాల్చి పడేసిన రాను పొమ్మంటున్నారు. దెయ్యాల నగరం గా జనం లేని ఆ రాజధాని పిలవబడుతుంది. అలాంటి రాజధాని మనకెందుకు. మయన్మార్ పేరు తీసి అమరావతి అని పేరు పెట్టకండి. మనుషులుంటేనే దేశం అంటారు. అక్కడ వున్నది 9 లక్షల 20 వేలమంది జనాభా. చంద్రబాబు చేసిన నిజమైన పని ఒకటే ఇప్పటికి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై బయటకు వచ్చి పోరాటానికి ఇప్పటికైనా దిగడం. ఆయన్ను ఐవైఆర్ ప్రశ్నిస్తే బురద వేస్తారు. పవన్ కళ్యాణ్ నాలుగేళ్లుగా ఏమి చేస్తున్నారు అంటే విమర్శిస్తారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పై కాకినాడ సభలోనే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డులంటూ విమర్శించారు. అప్పుడు అందరు ఆయన పై ఎక్కేశారు. అలా చేస్తుంటే బాబు సన్నాయి నొక్కులు నొక్కి పవన్ మనోడే ఏమి అనొద్దన్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తే మాత్రం పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అమరావతి భ్రమరావతి అనే పుస్తకం నేను రాసినప్పుడు ప్రపంచ రాజధానుల వివరాలను ఐవైఆర్ నాకు ఇచ్చారు. నా పుస్తకం కన్నా ఐవైఆర్ మరింత లోతుగా విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకం రాశారు. ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా ఉండటం శివరామకృష్ణన్ వంటివారిని కలిసి వివరాలు సేకరించడం వంటివి ఆయన ఈ పుస్తకంలో చక్కగా పొందుపరిచారు. నే రాసిన పుస్తకంలో కమ్యూనిస్ట్ లు ముద్రించి 22 పేజీల రూపంలో బుక్ లెట్ గా ఉచితంగా పంచిపెట్టారు. ఈ పుస్తకంలో మాత్రం సమగ్ర వివరాలు వున్నాయి. ఈ పుస్తక ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ఆనందంగా వుంది. ప్రజలకు అన్ని తెలియాలి. ఐవైఆర్ కు అభినందనలు.
