Fri Mar 27 2026 05:04:04 GMT+0530 (India Standard Time)
పాపం అనుకోవాలా? శాపం అనుకోవాలా?
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పక్కన పెట్టి సెంటిమెంట్ తో లబ్ది పొందేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.

రెండు పొట్టేళ్ల మధ్య పోరులో నలిగిన తాటిపండులా తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పక్కన పెట్టి సెంటిమెంట్ తో తాము లబ్ది పొందేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య బహిరంగ యుద్ధమే నడుస్తుంది. ఈ పోరులో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందనే చెప్పాలి.
వత్తిడులకు తలొగ్గకుండా?
అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నో వత్తిడులను ఎదుర్కొని, బలమైన ఆంధ్ర లాబీయింగ్ ను కాదని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడి నేతల చేతకాని తనంతో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా కాంగ్రెస్ ఇక్కడ లబ్ది పొందిందేమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి.
మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో...
అయితే దీనికి కారణాలేంటన్నది పక్కన పెడితే.. అసలు తెలంగాణ రాష్ట్రంపై తమకున్న పేటెంట్ ను ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్పుకోలేక పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదని, ఏపీకి అన్యాయం జరిగిందని అన్నప్పటికీ కాంగ్రెస్ దానిని వినియోగించుకోలేకపోయింది. అవును.. తెలంగాణ సమాజం ఆంక్షలను గౌరవించి సోనియా వత్తిడులకు లొంగకుండా ఇచ్చారని ఈసారి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. రాహుల్ గాంధీని అవమానపర్చారంటూ రోడ్డెక్కటం తప్ప స్పష్టమైన కార్యాచరణ అంటూ కాంగ్రెస్ కు లేకుండా పోయింది.
కాంగ్రెస్ ఎక్కడ?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కృషి ఉంది. అయితే ఆయన ఎంత చేసినా ఇవ్వాల్సింది కాంగ్రెస్. బీజేపీకి ఇందులో ప్రమేయం లేదు. కేవలం మద్దతు మాత్రమే ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడా లేకుండా పోయింది. రాష్ట్ర ఏర్పాటులో సంబంధం లేని ీటీఆర్ఎస్, బీజేపీలే హైలెట్ అవుతున్నాయి. ఇందుకేగా కాంగ్రెస్ రెండుసార్లు ప్రజల మద్దతును సంపాదించుకోలేకపోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సంబంధం లేని వారు కొట్లాడుకుంటుంటే రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రేక్షకుడిగా మిగిలిపోవడం పాపం అనాలా? దానికి అంతే కావాలి అనుకోవాలా? తెలియని పరిస్థిితి.
Next Story

