Tue Dec 30 2025 10:33:44 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాక్ రికార్డు చూస్తే తెల్వదూ... పొత్తు గ్యారంటీ అని?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరితోనైనా జత కట్టగలడు. ఎవరితోనైనా విభేదించగలడు. సీబీఎన్ ట్రాక్ రికార్డు అది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరితోనైనా జత కట్టగలడు. ఎవరితోనైనా విభేదించగలడు. సీబీఎన్ ట్రాక్ రికార్డు అది. ఒకసారి ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తారు. మరోసారి విభేదిస్తారు. సిద్ధాంతాలు అంటూ ఏమీ ఉండవు. గెలుపు లెక్కతోనే చంద్రబాబు పొత్తులకు సిద్ధపడతారు. చంద్రబాబు పొత్తుల కోసం ఏ ప్రయత్నం చేసినా ఇప్పటి వరకూ ఫెయిల్ కాలేదు. అందుకే ఈసారి కూడా జనసేనతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.
ఎవరితో కలిసేందుకైనా...?
1999లో చంద్రబాబు బీజేపీతో కలసి పోటీ చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ అదే కాంబినేషన్ లో 2004లో ఎన్నికలకు వెళ్లినా గెలుపు దక్కలేదు. దీంతో బీజేపీని చంద్రబాబు పక్కన పెట్టేశారు. బీజేపీని మతతత్వ పార్టీగా చంద్రబాబు గత పొత్తులను మరిచిపోయి ధైర్యంగానే చెప్పగలిగారు. ఇక 2009లో చంద్రబాబు టీఆర్ఎస్, కమ్యునిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీతో కలసి పోటీ చేశారు. అయినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్ ను విభేదించారు.
కాంగ్రెస్ తోనే....
2014 ఎన్నికల్లో తాను తిట్టిన బీజేపీతోనే జతకట్టారు. బీజేపీని దగ్గరకు చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత హోదా కోసం దానిని పక్కన పెట్టారు. ఇక 2018 ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు ట్రాక్ రికార్డులోనే రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అలాంటి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ తో జతకట్టేలా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితితో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీతో కలసి సభల్లో పాల్గొన్నారు. ఏడాది తిరగక ముందే చంద్రబాబు అదే రాహుల్ గాంధీని వ్యతిరేకించారు.
ఈసారి కూడా....
ఇక 2019 ఎన్నికల్లో పొత్తులతో ముందుకు వెళ్లాలన్నా అప్పటికే జనసేన కూటమిని ఏర్పాటు చేసుకుంది. దీంతో చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు తనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని భావించారు. అందుకే పొత్తుల కోసం గట్టిగా ప్రయత్నించలేదు. అందుకే చంద్రబాబు కూటములను కట్టడంలో దిట్ట. ఆయన ఎవరితో విభేదించినా, ప్రేమించినా స్వల్ప కాలమే. కాబట్టి చంద్రబాబు ప్రేమ పురాణం.. జనసేనతో పెళ్లి వరకూ దారితీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Next Story

