Wed Mar 18 2026 19:14:43 GMT+0530 (India Standard Time)
ఒకే ఫ్రేములో ఇద్దరూ.. ఇక కలిసనట్లేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కో బ్రదర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక ఫ్రేమ్ లో కన్పించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కో బ్రదర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక ఫ్రేమ్ లో కన్పించారు. ఈ అరుదైన ఘటన నందమూరి కుటుంబంలో జరిగిన ఒక నిశ్చితార్థ వేడుక వేదిక అయింది. నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కూతురి నిశ్చితార్థ వేడుకలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఎన్టీఆర్ ను గద్దె దింపినప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించారు.
పక్కన పెట్టడంతో....
అయితే తర్వాత చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను పక్కన పెట్టారు. రాజకీయంగా ఆయనను పార్టీలో ఎదగనివ్వకుండా చేయడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయన భార్య పురంద్రీశ్వరి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు. ఆయన మొన్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఇటీవల కాలంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
ఇద్దరూ కలసినా....
ఈ పరిస్థితుల్లో రాజకీయంగా శత్రువులుగా ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకేచోట కలసి పలుకరించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాదాపు 1996 నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఏదైనా కార్యక్రమాల్లో కలిసినా పలుకరించుకునే వారు కారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి పురంద్రీశ్వరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఏడ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇద్దరు కలవడంతో ఒకరినొకరు పలకరించుకోవడం చర్చగా మారింది. భవిష్యత్ లో కలసి రాజకీయంగా నడుస్తారా? లేదా? అన్నది చెప్పలేకున్నా, ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తొలగిందనే చెప్పాలి.
Next Story

