Fri Dec 05 2025 20:26:53 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక చేపట్టిన రెండు ప్రాజెక్టులు.. తెలంగాణకు ఇబ్బందులే
దిగువ రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు..

కర్ణాటక ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న రెండు ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరాదని లేఖలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు ప్రవాహం తగ్గుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
దిగువ రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ ఎలాంటి కేటాయింపులు చేయలేదని.. ప్రాజెక్టు అప్రయిజల్ డైరెక్టరేట్‌కు రాసిన ఈ లేఖలో ఈఎన్సీ మురళీధర్ గుర్తుచేశారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ కేటాయింపులు ఉన్నప్పటికీ.. సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ హోదా కల్పించింది. ఎగువ నదీ తీర రాష్ట్రాలలోని ప్రాజెక్టులను క్లియర్ చేసే ముందు దిగువన ఉన్న రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు మురళీధర్. కర్ణాటకకు చెందిన ఏ ప్రాజెక్టుకూ జాతీయ ప్రాజెక్టు హోదా మంజూరుపై అభ్యంతరం లేకపోయినా, నదీ తీర రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంలో వచ్చిన అన్ని పరిణామాలను ముందుగా పరిశీలించకుండా ఇచ్చిన ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రాజెక్టులకు అనుమతులను పరిగణలోకి తీసుకునే ముందు CWC ఈ అంతర్-రాష్ట్ర అంశాలను, ట్రిబ్యునల్ నివేదికలను వివరంగా పరిశీలించాలి. కానీ KWDT-I ద్వారా జరిగిన కేటాయింపులకు సంబంధించిన అనేక అంతర్-రాష్ట్ర అంశాలను, KWDT-IIకి ముందు జరిగిన విచారణలో తదుపరి పరిణామాలను ఇది పరిశీలించలేదని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. "KWDT-I ద్వారా అన్ని ఇతర సబ్-బేసిన్లకు, కృష్ణా-8 సబ్-బేసిన్లకు కేటాయింపుల మధ్య వ్యత్యాసం ఉందని చెబుతోంది తెలంగాణ. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులు ఉన్న కె-8 సబ్ బేసిన్ (తుంగభద్ర సబ్ బేసిన్)లో వినియోగంపై కొన్ని పరిమితులతో ఎన్ బ్లాక్ ప్రాతిపదికన నీటిని కర్ణాటకకు కేటాయించింది.
కాబట్టి, కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన పునర్ కేటాయింపులు, ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా తుంగభద్రపై ప్రాజెక్టులను CWC క్లియర్ చేయదు. తుంగభద్ర సబ్ బేసిన్, అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులలో కర్ణాటకకు కేడబ్ల్యూఎస్టీ-2 నీటి కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎత్తిచూపిన తెలంగాణ, ఈ కేటాయింపులు సంపూర్ణంగా లేవని తన వాదనను పునరుద్ఘాటించింది. ఇక కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అనేక ప్రాజెక్టులపై కూడా తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది.
Next Story

