Sat Dec 07 2024 23:53:18 GMT+0000 (Coordinated Universal Time)
23న బీజేపీలో చేరేది వారేనా?
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీలో చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీలో చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 23వ తేదీన అమిత్ షా సభలో సీనియర్ నేతల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. బీజేపీలో చేరేదెవరన్న దానిపై జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికార బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తారా? లేదా కాంగ్రెస్ నేతలను ఆకట్టుకుని వేదికపైకి తెస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా సభలో చేరికలు మాత్రం ఉంటాయని మాత్రం బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఇందుకోసం చేరిక కమిటీ కూడా కసరత్తు చేస్తుందని చెబుతున్నారు.
చేరికల కమిటీ...
అందుతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు బీజేపీలోకి వెళతారన్న సమాచారం అయితే బయటకు వచ్చింది. అందులో ఎంత నిజం ఉన్నదీ తెలియనప్పటికీ చేవెళ్ల సభలో ఆ ఎమ్మెల్సీ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య పొసగకపోవడం, బీఆర్ఎస్ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేకే మద్దతుగా ఉండటంతో ఆయన పార్టీని వీడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కూడా చేరికల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక నాయకులైన డీకే అరుణ లాంటి నేతలు కూడా వారిని సంప్రదిస్తూ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి నిర్ణయం ఇంకా వెలువడలేదు.
కాంగ్రెస్ ముఖ్యనేతలు...
ఇక కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ముగ్గురు ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరే అవకాశముందంటున్నారు. వారంతా కాంగ్రెస్ లో నాయకత్వం పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నవారు. నియోజకవర్గంలో సొంత బలం కొద్దో గొప్పో ఉన్నవారు కావడంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరకడమూ కష్టమని భావించి బీజేపీలో అయితే టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకుని మరీ చేరవచ్చన్న అభిప్రాయంతో చేరికల కమిటీ వారిని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిసింది. టిక్కెట్లు రావని డౌట్ ఉన్న వాళ్లు, నిధుల సమస్య ఉన్న నేతతు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.
టిక్కెట్ దక్కదని భావించి...
దీంతో పాటు బీఆర్ఎస్ లో గత ఐదేళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిలో అక్కడ పోటీ చేసిన అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు అని ప్రకటించడంతో కొందరు తమ రాజకీయ భవిష్యత్ కోసం కమలం దారి పడుతున్నారని సమాచారం. వారిలో కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని గ్యారంటీ టిక్కెట్ అని హామీలు దక్కడంతోనే కొందరు బీజేపీ వైపు వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి వేదికపైకి చివరకు ఎవరు వస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story