తెలంగాణ కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ..?

ఇప్పుడిప్పుడే చేరికలతో ఊపుమీద కనపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి ఈ మధ్యే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇంతకాలం నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ కి బద్ధ వ్యతిరేకిగా పనిచేశారు. నాగంపై నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మూడు దశాబ్ధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి రాజకీయయుద్ధం చేస్తున్నారు. నాగంపై నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.
జీర్ణించుకోలేకపోతున్న దామోదర్ రెడ్డి..
నాగంపై పోటీ ద్వారా దామోదర్ రెడ్డి అన్ని రకాలుగా నష్టపోయారు. అయినా కూడా ఇన్నేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని, కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే దామోదర్ రెడ్డి కష్టాన్ని గుర్తించిన పార్టీ ఆయనకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ, తాను ఇన్నేళ్లుగా ఎవరిపైనైతే పోరాడుతున్నారో, ఆ నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని దామోదర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పలుసార్లు తన అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. నాగం చేరికను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు.
ఫలించిన హరీష్ చర్చలు..?
ఎన్నిరకాలుగా ప్రయత్నించినా దామోదర్ రెడ్డి నాగం చేరికను అడ్డుకోలేకపోయారు. దీంతో నాగం లాంఛనంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు దామోదర్ రెడ్డికి నచ్చజెప్పినా ఆయన అసంతృప్తి మాత్రం చల్లారలేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పాలమూరు జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న గులాబీ పార్టీకి ఇది సరిగ్గా కలిసి వచ్చింది. దీంతో వెంటనే ఆ పార్టీ హరీష్ రావును రంగంలోకి దింపిందని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే దామోదర్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, వచ్చే వారమే దామోదర్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, తెలంగాణ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ కోల్పోవడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

