80 రోజుల్లో 100 కొట్టాలి ... అదే ఆయన టార్గెట్

బాల్స్ తక్కువ వున్నాయి. రన్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏ బ్యాట్సమెన్ కి అయినా హార్డ్ హిట్టింగ్ తప్పదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. ఏ మొహం పెట్టుకుని జనం దగ్గరకు పోవాలి ? అని భావించిన గులాబీ బాస్ అభివృద్ధి పనుల వేగం రెట్టింపు చేశారు. శరవేగంగా అనుకున్నవన్నీ 80 రోజుల్లో 100 శాతం చేసి తీరాలని కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసిపారేశారు. ఇప్పుడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులపై పనుల బాట పట్టనుంది. అది తెలంగాణ లో చిత్రం.
మిషన్ భగీరధపై బెంగ ....
ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు ఇచ్చిన తరువాతే, ఓట్లు అడిగేందుకు వస్తామని గత ఎన్నికల్లో విజయం సాధించాకా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. నిర్ధేశిత లక్ష్యాల ప్రకారం పనులు నడవడం లేదు. నత్తనడకన మిషన్ భగీరథ నడుస్తుండటంతో స్వయంగా తెలంగాణ బాస్ సీన్ లోకి వచ్చేశారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్ధేశం చేశారు. తాను ఫిక్స్ చేసిన ఈ టార్గెట్ లో ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా వారిపై కఠినంగా చర్యలు చేపట్టేందుకు సైతం ఒక బృందాన్ని టి బాస్ ఏర్పాటు చేసేశారు. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్న కేసీఆర్ అందుకోసం అవసరమైన కసరత్తు ముమ్మరం చేశారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు నెరవేరతాయో చూడాలి.
