Fri Dec 06 2024 17:10:33 GMT+0000 (Coordinated Universal Time)
అటక మీద పెట్టేశారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్నటి వరకూ చేసిన హడావిడి ఇప్పుడు కన్పించడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్నటి వరకూ చేసిన హడావిడి ఇప్పుడు కన్పించడం లేదు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రకటించాలనుకున్న భారత రాష్ట్ర సమితిని పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. విపక్షాలు ఎవరి దారి వారిదే. ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం మినహా ఇతర పక్షాలు బీఆర్ఎస్ వైపు చూసేందుకు ఇష్టపడవు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడం, గాంధీ కుటుంబం నేతృత్వంలో నడుస్తుండటంతోనే విపక్షాలు అధిక శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాయి. అంతే తప్ప దక్షిణాదిలో ఒక ప్రాంతీయ పార్టీ వైపు నడవటానికి ఇష్టపడే అవకాశాలు కన్పించడం లేదు.
జాతీయ రాజకీయాలపై...
మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే రాష్ట్రంలో అసలుకే ఎసరు వస్తుందన్న అనుమానమూ లేకపోలేదు. రాష్ట్రంలో జాతీయ పార్టీలను ఎదుర్కొంటున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టాలని భావించినా ఆదిలోనే ఇబ్బందులు ఎదురయినట్లే కనిపిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అది క్లిస్టర్ క్లియర్ గా కన్పించింది. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు అనేకమంది ముందుకు రాలేదు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కితే అన్ని విపక్షాలు దానివైపు మొగ్గు చూపుతాయి. లేకుంటే కాంగ్రెస్ ను వదిలేసేందుకు కూడా వెనుకాడవు.
ఇక్కడ అధికారం దక్కకపోతే...
అలాగే టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఇటు వైపు కూడా ఏ పక్షమూ చూడదు. ఆ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. భారత రాష్ట్ర సమితిని ప్రకటిస్తామని కేసీఆర్ నేరుగా చెప్పకున్నా ఆపార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. త్వరలోనే దానికి ముహూర్తం పెడతారని, కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పుకొచ్చింది. కేసీఆర్ కూడా వివిధ రంగాల నిపుణులు, మేధావులతో తరచూ సమావేశాలు కావడం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే బీఆర్ఎస్ ను కేసీఆర్ బయటకు తీసుకువస్తారని అందరూ భావించారు. కానీ ఆయన గత కొంతకాలంగా దాని ఊసు ఎత్తడమే మానుకున్నారు.
అంత సులువు కాదు...
తొలుత వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలవడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం. ఈసారి ఎన్నికల్లో గెలవడం టీఆర్ఎస్ కు అంత సులువు కాదు. తొమ్మిదేళ్ల పాలనలో సహజంగా తలెత్తే అసంతృప్తి ఒక వైపు, విపక్షాలు కూడా గతంలో కంటే బలపడుతుండటంతో టీఆర్ఎస్ గెలుపు ఈసారి నల్లేరు మీద నడక అయితే కాదు. తెలంగాణలోనూ చాలా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. యువత, ఉద్యోగ వర్గాలతో పాటు కొన్ని సామాజికవర్గాలు దూరమయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్రంలో టీఆర్ఎస్ బలోపేతంపైనే ఆయన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో అధికార పార్టీ పరిస్థితి అంత బాగా లేదన్న సర్వేలు బీఆర్ఎస్ ను అటకెక్కించాయంటున్నారు.
Next Story