Sun Oct 13 2024 21:09:55 GMT+0000 (Coordinated Universal Time)
కలిస్తే... గెలిచినట్లేనా... లెక్కలు అలా లేవే?
వచ్చే ఎన్నికలకు మహా కూటమితో జగన్ ను ఎదుర్కొనాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనపడుతుంది
కూటములు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి. అన్ని పార్టీలు కలిస్తే తమ ఏకైక శత్రువును ఓడించగలరా? పొత్తులతో ఓట్ల శాతం పెరుగుతుందా? ఇప్పుడు అటెన్షన్ అంతా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైనే. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలవడం అనేక చర్చలకు దారితీసింది. వచ్చే ఎన్నికలకు మహా కూటమితో జగన్ ను ఎదుర్కొనాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనపడుతుందంటున్నారు. ప్రస్తుతం జగన్ ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా ఏ పార్టీ ఎదుర్కొనలేదన్న భావన అందరిలోనూ ఉంది. అందుకే అందరూ ఒక్కటయి జగన్ ను పదవి నుంచి దింపే ప్రయత్నాలు చేయాలన్నది వారి ప్లాన్.
2009 ఎన్నికల్లో...
అయితే గతంలో కూటములు ఏర్పడ్డా ఏ మేరకు సక్సెస్ అయ్యాయి అంటే చరిత్ర చెబుతుంది లేదనే. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో 2009లో వైఎస్ ను దించేటందుకు మహాకూటమి ఏర్పడింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా కోరుకునే టీఆర్ఎస్ ను కూడా తమ కూటమిలోకి చంద్రబాబు ఆహ్వానించారు. సెంటిమెంట్ పనిచేస్తుందని భావించారు. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాని కాంగ్రెస్ 157 స్థానాల్లో విజయం సాధించగా, మహాకూటమి 106 స్థానాలకే పరిమితమయింది. ప్రజారాజ్యం పార్టీకి 18 స్థానాలు వచ్చాయి. ప్రజారాజ్యం వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామని అప్పట్లో టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ సంక్షేమ పథకాలే వైఎస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించాయి.
గత తెలంగాణ ఎన్నికల్లో...
ఇక గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితితో పాటు సీపీఐని కలుపుకుని మహాకూటమిని ఏర్పాటు చేశారు. రెండోసారి అంటే 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలని ఈ కూటమి ఏర్పడింది. తన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమైనప్పటికీ బలమైన కేసీఆర్ ను పదవి నుంచి తప్పించేందుకు చంద్రబాబు తొలిసారి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కానీ 2014 కన్నా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు లభించడమే కాకుండా కేసీఆర్ మరింత బలపడ్డారు. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలే కేసీఆర్ విజయానికి కారణాలని రాజకీయ విశ్లేషకులు సయితం చెప్పిన విషయం. పైగా ఇతర పార్టీలపై నమ్మకం ప్రజల్లో లేకపోవడం కూడా కేసీఆర్ కు గత ఎన్నికల్లో కలసి వచ్చిందన్న కామెంట్స్ కూడా అప్పట్లో వినపడ్డాయి.
ఏపీలో అదే సీన్....
ఇప్పుడు మరోమారు ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి పేరు వినిపిస్తుంది. టీడీపీ, జనసేన, కమ్యునిస్టు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలను దూరం పెట్టినా ఇక్కడ ఈ పార్టీలు మాత్రం కలవడం దాదాపు ఖాయమయిపోయినట్లే అనుకోవాలి. అది మహాకూటమి అనుకోవాలా? లేదా మరో పేరు పేరుతో ప్రజల ముందుకు వస్తుందా? అన్నది పక్కన పెడితే కూటమి మాత్రం ఖాయంగా ఏర్పడుతుందని చెప్పాలి. ఇప్పుడు జగన్ ను కుర్చీ నుంచి దించడమే లక్ష్యం. అయితే ఇప్పుడు కూడా జగన్ సంక్షేమ కార్యక్రమాలతో దూసుకు వెళుతున్నారు. మరి 2024 ఎన్నికల్లో కూటమి వైపు ప్రజలు మొగ్గుతారా? లేదా మళ్లీ పాత కథే రిపీట్ అవుతుందా? అన్నది మాత్రం భవిష్యత్ లో తేలనుంది.
Next Story