Fri Dec 26 2025 22:31:02 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ టీడీపీదే అధికారం
ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుబాటు మొదలయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుబాటు మొదలయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నిన్న రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు పార్టీకి అండగా నిలిచారన్నారు. రేపు ప్రజల్లోనూ ఇదే రకమైన తిరుగుబాటు కనిపించబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని, చారిత్రాత్మక అవసరమని చంద్రబాబు తెలిపారు. ఖచ్చితంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలిపారు.
జగన్ వల్ల...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రాజధానిని లేకుండా చేశాడని ఆరోపించారు.గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసుకుంటే ఏపీలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించవచ్చనితెలిపారు. విభజన కంటే జగన్ వల్లే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన చెందారు. రాష్ట్రం మరో ముప్ఫయి ఏళ్లు వెనక్కు వెళ్లిందన్న చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే నేడు ప్రతి ఒక్కరూ టీడీపీ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే తిరిగి ఏపీలో అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.
శాశ్వత సభ్యత్వం కోసం...
నిధుల కోసం ఇంకొకరి వద్ద చేయి చాచకుండా టీడీపీలో శాశ్వత సభ్యత్వం కావాలంటే ఐదువేల రూపాయలు చెల్లించాలన్నారు. పార్టీని కార్యకర్తలే బతికించుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలపై కాకుండా పేదలపై పార్టీ ఆధారపడేలా చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఐదు వేల రూపాయలు చెల్లించి పార్టీ శాశ్వత సభ్యులుగా చేరాలని క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఇక నిధుల సమీకరణ కోసం శ్రమించకుండా సరిపోతుందని తెలిపారు.
వందో సభ రాజమండ్రిలో...
ఇక రాజమండ్రిలో వందో సభను నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు మొదటి సభ అని, వందో సభను రాజమండ్రిలో నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. సభలను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. పార్టీ కోసం ఒక గంటపాటు పని చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇన్నాళ్లు పార్టీ కార్యకర్తలే వెన్నుదన్నుగా టీడీపీకి నిలిచారని, ఇక ముందు కూడా అలాగే సహాయ సహకారాలను అందించాలని, ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలను విస్మరించే ప్రసక్తి లేదని చంద్రబాబు తెలిపారు.
Next Story

