Mon Dec 29 2025 20:47:34 GMT+0000 (Coordinated Universal Time)
అనుకున్నంత ఈజీ కాదు... ఆ విషయం తెలిసినా?
చంద్రబాబు ఎవరిని నియోజకవర్గం నుంచి తప్పించాలని చూసినా రాజకీయంగా ఇబ్బందులు తప్పవు

బలహీనంగా ఉన్నప్పుడే పైకి ఎక్కుతారు. బలంగా ఉన్న ప్పుడు భయపడే వారు కొంచెం వీక్ అవ్వగానే వీరంగం చేసేస్తారు. తాము తప్ప టీడీపీకి దిక్కులేదన్న పరిస్థితుల్లో టీడీపీ నేతలున్నారు. ఇందుకు ప్రధాన కారణం కొన్ని దశాబ్దాల కాలంగా కొత్త వారిని ఎదగనివ్వకపోవడమే. నియోజకవర్గంలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలను సయితం దశాబ్దాలుగా ఎదగనివ్వలేదు. వారికి కనీసం పార్టీలో పదవులు కూడా దక్కలేదు. దీంతో వారే నియోజకవర్గంలో మోనార్క్ లుగా చలామణి అవుతున్నారు.
ఎవరిని తప్పించాలని చూసినా..?
చంద్రబాబు ఎవరిని నియోజకవర్గం నుంచి తప్పించాలని చూసినా రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే వారంతా ధీమాగా ఉన్నారు. తమకు తప్ప ఎవరికీ సీటు రాదన్న ఆలోచనతోనే వారు పార్టీలో యాక్టివ్ గా లేకపోయినా పరవాలేదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు చివరి నిమిషంలో యాక్టివ్ అయ్యేవారికి టిక్కెట్లు దొరకవని చెప్పడంపై కూడా పెద్దగా నేతలు టెన్షన్ పడటం లేదు.
సొంత వర్గంతో....
ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో నేతలు తమ సొంత వర్గాన్ని పెంచుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్ లేకపోయినా తన వర్గం వారిని మాత్రం వారు దూరం చేసుకోలేదు. ఇప్పుడు అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ అదే పరిస్థిితి నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించిన ధర్మవరపు సుబ్బారెడ్డిని కేఈ కుటుంబం వ్యతిరేకిస్తుంది. ఆయనకు సహకరించే పరిస్థితి లేదని చెబుతుంది.
పోటీ పెరిగినా....
అదే సమయంలో ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి వద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ పరిటాల శ్రీరామ్ అక్కడ పాతుకుపోయారు. దీంతో సూరిని దూరం చేసుకుంటే ప్రధానంగా టీడీపీ ఓటు బ్యాంకుకే గండి పడనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థులను మారుస్తారన్నది ఉత్తమాటేనన్న కామెంట్స్ పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని, ఈసారి టీడీపీ గెలుపునకు సహకరించాలని చెప్పినా వినే పరిస్థిితి లేదు. మరి చంద్రబాబు కు ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే అవుతుందని చెప్పకతప్పదు.
Next Story

