Mon Aug 15 2022 04:36:58 GMT+0000 (Coordinated Universal Time)
శ్రావణ శుక్రవారం .. ప్రతి ఇంటిలోనూ ప్రత్యేకతే

శ్రావణమాసం అంటేనే మహిళలకు ప్రత్యేకం. వారికోసమే ఈ మాసం ప్రత్యేకంగా ఉందని చెప్పక తప్పదు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం మహిళలు ఎక్కువ మంది జరుపుకుంటారు. ఈరోజు వివిధ కారణాలతో వీలుకాని మహిళలు ఆ మాసంలో వచ్చే మరో శుక్రవారంలో చేసుకునే వీలుంది. అందుకే ఈ మాసం అంతా మహిళలు శుక్రవారాన్ని ఒక విశిష్టదినంగా భావిస్తారు. తమ కుటుంబసభ్యుల సంక్షేమం కోసం వారు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఏడాదంతా...
శ్రావణ శుక్రవారం అమ్మవారికి పూజలు జరిపితే ఏడాదంతా ఆనందంగా గడుస్తుందని, తమ కుటుంబానికి అమ్మవారు కష్టాలు దరి చేరనివ్వరన్న నమ్మకంతో పూజలు నిర్వహిస్తారు. అష్టలక్ష్మిలను మహిళలు నిత్యం పూజిస్తుంటారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ఆయురోరాగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలను కోరుకుంటారు. అష్టలక్ష్మిలలో ప్రత్యేకంగా శ్రావణమాసంలో వరలక్ష్మిని పూజలు చేయడం శుభసూచకంగా మహిళలు భావిస్తారు.
సాయంత్రమంతా ఒకచోట...
మహిళలంతా ఈ పూజలు చేసుకుని సాయంత్రం ఒకరింటికి ఒకరు పేరంటానికి పిలుచుకుంటారు. ఇంటికి వచ్చిన మహిళలకు తాము చేసిన ప్రసాదాలాను తినిపించడంతో పాటు వారికి తాంబూలాలను ఇస్తారు. పెద్ద ముత్తయిదువల నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటారు. వారికి శెనగలు, అరటిపండ్లు, స్థాయిని బట్టి పండ్లను వాయనంగా ఇచ్చుకుంటారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం కావడంతో మహిళలందరినీ సాయంత్ర వేళ ఒకచోట చేర్చే పండగ శ్రావణశుక్రవారం అని చెప్పాలి.
వీధులన్నీ....
శ్రావణ మాసం దేవతలకు అత్యంత ఇష్టమైన మాసంగా మహిళలు భావిస్తారు. దీర్ఘసుమంగళీ యోగం సంభవించాలంటే ఈ మాసం అంతా అత్యంత శ్రద్ధ, నిష్టలతో పూజలు చేయాలనుకుంటారు మహిళలు. అందుకే శ్రావణమాసం అంతా వీధులన్నీ పరిశుభ్రమైన వాతావరణం తో పాటు ఇళ్ల నుంచి సుగంధ వాసనలు వెదజల్లుతుంటాయి. ప్రత్యేకంగా పూలు, పండ్లకు ఈ మాసం అంతా గిరాకి ఉంటుంది. అందుకే శ్రావణమాసం వస్తుందంటేనే మహిళలు కొత్త చీరలు, నగలతో ధగధగ మెరిసిపోతుంటారు. తమ ఆర్థిక పరిస్థితిని బట్టి అమ్మవారితో పాటు వారు కూడా అలంకరించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.
Next Story