స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో?

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు మంచి జోష్ మీద వుంది. హై కోర్ట్ కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాల రద్దు కొట్టేయడంతో కాంగీయులంతా కేసీఆర్ సర్కార్ పై మాటల తూటాలు విసిరేశారు. అవి అలా ఇలా కాదు. ఒక రేంజ్ లో. టి సర్కార్ తాజా పరిణామాలతో అనూహ్యంగా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. స్పీకర్ మధుసూధనాచారి న్యాయనిపుణులతో చర్చలు సాగిస్తున్నారు. మరో పక్క తీర్పు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హై కోర్టు తీర్పుపై సుప్రీం కు వెళుతుందా లేక స్పీకర్ కోమటిరెడ్డి సంపత్ లకు మరోరకంగా చెక్ చెబుతారా ? లేక ఈ అంశాన్ని మరుగున పర్చడానికి మరో కొత్త అంశం తెరపైకి సర్కార్ తెస్తుందా ? అన్న చర్చ ఇప్ప్డుడు తెలంగాణాలో జోరుగా సాగుతుంది.
కేసీఆర్ పై ఒంటికాలిపై లేచిన నేతలు ...
తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఈ కేసులో బయటపడిన కోమటిరెడ్డి ఆనందానికి అవధులు లేవు. తనను మానసికంగా కేసీఆర్ సర్కార్ వేధించిందని నెలరోజులపాటు గన్ మ్యాన్లు తీసేసి ఆడుకుందన్నారు. పైన దేవుడు వున్నంతకాలం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం, న్యాయస్థానాలు న్యాయంవైపు వున్నంతకాలం తమలాంటివారికి అన్యాయం జరగదంటూ పంచ్ డైలాగ్స్ కొట్టారు కోమటిరెడ్డి. కేసీఆర్ డ్రామా కంపెనీ యజమానిగా సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ సర్కార్ కి సిగ్గు ఉంటే రాజీనామా చేసి దిగిపోవాలని మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఇలా పదునైన విమర్శలతో విరుచుకుపడి ముప్పేట దాడి చేశారు కాంగ్రెస్ నేతలు.
