కొట్టి చంపేస్తున్నారే...?

సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలో అన్ని నష్టాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు బీహార్ నుంచి ప్రవేశించాయి అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనుమానితులు, యాచకులపై తీవ్ర స్థాయిలో దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దాడులు భారీగా సాగుతున్నాయి. ముఖ్యంగా మతిస్థిమితం లేని వారు బిచ్చగాళ్ళు జనం దాడుల్లో బాధితులుగా మారుతున్నారు. ఈ వ్యవహారం ముదిరిపాకాన పడటంతో పోలీసులకు అదనపు భారం పడింది. ఖాకీలు పెద్ద ఎత్తున ఈ రూమర్లు నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నా వినేవారు లేకుండా పోయారు. మయన్మార్ లో చిన్నారులపై జరిగిన దాడులను మిక్స్ చేసి కొందరు జర్నలిస్ట్ లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్లే ఇదంతా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై చర్యలకు పోలీసులు దిగారు. ఇద్దరు జర్నలిస్ట్ లను ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హిజ్రాలపై దాడి ....
హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో యాచక వృత్తి కోసం హిజ్రాలుగా మారి సంచరిస్తున్న ఇద్దరిపై కిడ్నప్ ముఠా అనుకుని స్థానికులు దాడికి పాల్పడిన సంఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో చంద్రయ్య అనే వ్యక్తి చనిపోగా, స్వామి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చావు బతుకుల నడుమ చికిత్స పొందుతున్నాడు. దాడిని అడ్డుకోవడానికి అక్కడికి హుటాహుటిన చేరిన పోలీసులపై కూడా రాళ్ళు విసరడంతో ఇద్దరు ఖాకీలకు గాయాలు అయ్యాయి. ప్రార్ధనల సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు దాడుల్లో పాల్గొన్నారు. ఈ సంఘటన అనంతరం 25 మందిని అరెస్ట్ చేసి వారిపై హత్యా అభియోగంపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అదేవిధంగా అసత్య ప్రచారం చేస్తున్న కొందరు జర్నలిస్ట్ లపై కేసులు నమోదు చేశారు ఖాకీలు.
రాజమండ్రి అర్బన్ పోలీసుల సేవ ....
తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కిడ్నాప్ ముఠాలు గా భావించి యాచకులు, మతిస్థిమితం లేనివారిపై సాగుతున్న దాడులతో రాజమండ్రి పోలీసులు అప్రమత్తం అయ్యారు. రోడ్లపై తిరుగుతున్న బిచ్చగాళ్లను, మానసిక స్థితి సరి లేనివారిని గుర్తించి వారికి కేశ సంరక్షణ చేయించి మంచి బట్టలు వేస్తున్నారు పోలీసులు. ఈ చర్యలు సత్పలితాలనే ఇస్తున్నాయి. పోలీసులు చేస్తున్న ఈ వినూత్న తరహా మంచి కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నాయి.
