Sat Aug 13 2022 06:39:00 GMT+0000 (Coordinated Universal Time)
తొక్కితే కాని.. తాడేపల్లి గుర్తుకు రాలేదా?

అవును.. జగన్ ముఖ్యమంత్రి అయి మూడేళ్లయింది. ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు వచ్చి జగన్ కు ముఖ్యమంత్రి అయినందుకు ఇప్పటి వరకూ అభినందనలు చెప్పలేదు. కనీసం టాలీవుడ్ సమస్యలపై కూడా వారు చర్చించేందుకు ఇష్టపడలేదు. జగన్ ను టాలీవుడ్ ముఖ్యమంత్రిగా చూడటం లేదన్న అభిప్రాయం స్ట్రాంగ్ గా ఉంది. ఎన్నికల సమయంలోనూ జగన్ కు అండగా టాలీవుడ్ నుంచి ఎవరూ నిలబడ లేదు. వారి రాజకీయ కారణాలు వారికి ఉండవచ్చు.
జగన్ ను అభినందించడానికి...
కానీ 151 సీట్లతో జగన్ అతి పెద్ద విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ కు అండగా నిలిచిందని ఫలితాలను బట్టి తెలిసింది. అయినా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందించాలని ఏ ఒక్కరికీ నోరు రాలేదు. కలవడానికి కూడా వారు ఇష్టపడలేదు. మనసు రాలేదు. నాగార్జున వంటి సన్నిహితులు తప్పించి ఎవరూ జగన్ ను అభినందించిన పాపాన పోలేదు. ఇది వైసీపీలో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. చిన్నా చితకా నటులు తప్ప టాలీవుడ్ నుంచి మద్దతు లభించకపోయినా జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
పరుగులు తీయడం....
అయితే ఇప్పుడు పోలోమంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి టాలీవుడ్ ప్రముఖులు పరుగులు తీశారు. ఇందులో చిరంజీవికి మినహాయింపు ఉంది. చిరంజీవి ఇప్పటికి రెండుసార్లు జగన్ ను కలిసి వెళ్లారు. సైరా సినిమా విడుదలయిన సందర్భంలో ఒకసారి, టాలీవుడ్ సమస్యలను చర్చించడానికి మరోసారి చిరంజీవి వచ్చి కలసి వెళ్లారు. కానీ ఇతర టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు మాత్రం జగన్ ను కలిసే తీరిక లేకుండా పోయింది.
టిక్కెట్లను పెంచడంతో...
ఏపీలో సినిమా టిక్కెట్లను పెంచడాన్ని టాలీవుడ్ తట్టుకోలేకపోయింది. జగన్ పట్టుదల, మొండితనం తెలిసిన టాలీవుడ్ ఎట్టకేలకు దిగివచ్చింది. మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు ఇప్పుడు జగన్ వద్దకు చర్చలకు వస్తున్నారు. ఇప్పటికీ కొందరు ప్రముఖులు ఈ భేటీకి దూరంగా ఉండటం విశేషం. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్న కొందరు జగన్ ను కలిసేందుకు ఇప్పటికీ ఇష్పపడటం లేదు. మొత్తం మీద టాలీవుడ్ లో కదలిక వచ్చింది. తమ కిందకు నీరు చేరితే కాని జగన్ గుర్తుకు రాలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story