కర్ణాటకలో సీఎం పదవి పితలాటకం

కర్ణాటక ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయలుదేరాయి. కాంగ్రెస్ లో ఎప్పుడూ అంతే. ఆపార్టీకి శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే అది కాంగ్రెస్ లోనే ఉంటారన్న నానుడి అందరికీ తెలిసిందే. కర్ణాటక ఎన్నికలు వచ్చే నెల 12వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా చెప్పలేమని, ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎంపిక చేసకుంటారని ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
హైకమాండ్ నిర్ణయమన్న ఖర్గే......
ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని చెప్పారు. ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేనది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధిష్టానానికి ముఖ్యమంత్రిగా ఎవరినైనా నియమించే అధికారం ఉంటుందని, తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని చెప్పారు. అయితే ప్రస్తుత ఎన్నికలకు సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారన్నారు. ప్రస్తుతానికి ఆయనే కెప్టెన్ అని చెప్పారు.
తానే సీఎం అంటున్న సిద్ధూ.....
మరోవైపు సిద్ధరామయ్య దీనిపై స్పందించారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవికి ముందు వరుసలో ఉన్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన సంక్షేమ పథకాలే తమను ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయన్నారు. ప్రభుత్వ పనితీరుపైన గాని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం పట్ల గాని ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అమిత్, మోడీలు కర్ణాటక వచ్చి చేయగలిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తాను రెండు చోట్ల పోటీ చేయడం పెద్ద విషయమేమీ కాదన్నారు.
