పాత వందనోటు కు ఇక గుడ్ బైనా ...?

వెయ్యి రూపాయల స్థానంలో రెండువేల రూపాయలను దింపిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త వందరూపాయల నోటు విడుదల చేసింది. నోట్ల రద్దు తరువాత దేశంలో ఏర్పడ్డ కరెన్సీ కొరత ఇప్పటికి పూర్తిగా తీరలేదు. రెండువేలరూపాయల నోటు తరువాత పాత ఐదువందల రూపాయల నోటు స్థానంలో కొత్తవి తీసుకువచ్చింది రిజర్వ్ బ్యాంక్. అలాగే రెండువందల రూపాయల నోటు, 50 రూపాయల కొత్తనోట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా జన జీవన స్రవంతిలో అత్యధికంగా చలామణి అయ్యే వందరూపాయలు ప్రింట్ చేసింది రిజర్వ్ బ్యాంక్. అయితే కొత్త నోటు వచ్చినా పాత వందరూపాయల చలామణి యధావిధిగా కొనసాగుతుందని ఆర్బీఐ ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
అత్యధిక సెక్యూరిటీ ఫీచర్లు ...
కొత్త వందరూపాయల నోటు పాత వందరూపాయల కన్నా పరిమాణంలో చిన్నగా ఉంటుంది. అయితే అత్యధిక సెక్యూరిటీ ఫీచర్లను ఆర్బీఐ ఇందులో ఉండేలా జాగర్తలు తీసుకుంది. నకిలీ వందరూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో చలామణి అవుతున్న పరిస్థితిలో దశల వారీగా వాటి స్థానంలో వీటిని ముద్రించాలన్న ఆలోచన ఆర్బీఐ చేస్తుంది. నోట్ల రద్దు జరిగిన నాటినుంచి మార్కెట్లోకి కొత్త నోటు విడుదల అవుతుంటే జనం ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నోటు వచ్చింది అంటే పాతవి ఇక రద్దు అయిపోతాయేమో అన్న భయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా రెండువేలరూపాయల నోటును ఎన్నికల ముందు రద్దు చేసి వెయ్యి రూపాయలు కొత్త నోటును ఆర్బీఐ విడుదల చేస్తుందేమో అన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే రెండువేలరూపాయల నోటు చలామణి బాగా తక్కువైంది. మోడీ సర్కార్, ఆర్బీఐ ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన చేస్తాయన్న భయం దేశ వాసుల్లో ఇప్పటికి పోకపోవడం విశేషం.
