ఈ యువనేతపై అంత నమ్మకం....!

రాజస్థాన్ లో గెలుపు పై కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా ఆశలు పెట్టుకుంది. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తుంది. రాహుల్ గాంధీ తన ప్రియ మిత్రుడు సచిన్ పైలెట్ కు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన ఊరూరా తిరుగుతూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మేరా బూత్ మేరా గౌరవ్’’ అనే నినాదంతో పార్టీని బూత్ స్థాయికి తీసుకెళ్లేందుకు సచిన్ పైలెట్ శ్రమిస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటుగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సచిన్ పైలెట్ కే పూర్తి బాధ్యతలు....
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ భంగపడింది. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రాజస్థాన్ బాధ్యతలను పూర్తిగా సచిన్ పైలెట్ పైనే ఉంచారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయినా కుంగి పోకుండా సచిన్ పైలెట్ రాష్ట్రానికే పరిమితమై పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాహుల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు పైలెట్. రాజస్థాన్ లో అధికార పార్టీ తిరిగి మరోసారి గెలిచిన దాఖాలలు లేవు. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి మట్టికరవడం ఖాయమని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
ప్రభుత్వ వ్యతిరేకతతో.....
అలాగే రాజస్థాన్ ముఖ్మమంత్రి వసుంధర రాజేపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెబుతున్నారు. బీజేపీ నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే విషయం బయటపడటంతో కమలనాధులు కొంత కలవరానికి గురై దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం కూడా ఏమీ ఉండదని, ప్రభుత్వ వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సచిన్ పైలెట్ కు రాహుల్ ఫ్రీ హ్మాండ్ ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాలను కూడా ఆయనే రూపొందిస్తున్నారు.
ఒంటరిగానే బరిలోకి దిగాలని...
అయితే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని సచిన్ పైలెట్ చెబుతున్నారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈరోజు కలిసిన పైలెట్ రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా వివరించారు. ఇప్పటికే పార్టీ రాష్ట్రంలో బలోపేతమైందని, మెజారిటీ స్థానాలను వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

