దీక్షలోనే కన్నుమూత....!

ఓట్ల కోసం దీక్షలు చేసే నేతలను చూశాం... రెండు రోజులకే షుగర్ లెవల్స్ పడిపోయాయి అని చేసే హడావిడి... వారం రోజులు కూడా కాకుండా ఆసుపత్రికి తరలించి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే వారు నేతలు కాబట్టి. కానీ, గంగా నదిని పరిరక్షించాలని కోరుతూ ఓ విశ్రాంత ప్రొఫెసర్ ఏకంగా 109 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా ఆయన తన డిమాండ్లను నెరవేర్చుకోలేకుండానే కన్నూమూశారు. కాన్సూర్ ఐఐటీలో ప్రోఫెసర్ గా పనిచేసిన జీడీ అగర్వాల్(87)ని స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్ అని కూడా పిలుస్తారు. మొదటి నుంచి ఆయనకు పర్యావరణం పట్ల విపరీతమైన మక్కువ. గంగా నదిని కాలుష్యం బారి నుంచి కాడాపాడాలని ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు. ఆయన కోరికను నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయి.
నీళ్లతోనే 109 రోజుల దీక్ష...
దీంతో చివరి అస్త్రంగా ఆయన జూన్ 22వ తేదీన రిషీకేష్ లో నిరాహార దీక్షకు దిగారు. దీక్ష సమయంలో కేవలం తేనె కలిపిన నీటిని మాత్రమే తీసుకున్నారు. రెండు రోజుల క్రింతం ఆయన దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. దీంతో తన ఆందోళనను మరింత ఉదృతం చేయాలనే ఉద్దేశ్యంతో రెండురోజులుగా మంచినీళ్లు తాగడం కూడా మానేశారు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పోలీసులు ఎయిమ్స్ కి తరలించగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. గంగానది కోసం, పర్యావరణాన్ని కాపాడి భావి తరాలకు అందించాలన్న జీడీ అగర్వాల్ ఆశయం నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.

