Fri Aug 12 2022 03:55:57 GMT+0000 (Coordinated Universal Time)
పీకే ఎంట్రీకి ముందే మొదలెట్టేశారే?

ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ ఒక గోల్ కీపర్ గా మారారు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులు గోల్ చేయనివ్వకుండా ఆపగలరన్న పేరుంది. మరోసారి ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటారని సాక్షాత్తూ జగన్ చెప్పారు. ఈ విషయం మంత్రి వర్గ సమావేశంలో చెప్పి దాదాపు మూడు నెలలకు పైగానే అవుతుంది. ఆయన టీమ్ కూడా ఇంతవరకూ ఏపీలోకి అడుగు పెట్టలేదంటున్నారు.
ఈ ఏడాదిలోనే...
ఈ ఏడాదిలో పీకే టీం కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. మరో రెండు నెలల్లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తొలి దఫా సర్వే జరుగుతుందంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ను కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేవాడిగా చిత్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని పీకే గత ఎన్నికల్లోనూ కులాలు, మతాల మధ్య తేడాలు తేవడంతోనే చంద్రబాబు అధికారానికి దూరమయ్యారని, జగన్ కు సీఎం కుర్చీ దక్కిందని కొందరు గట్టిగా విశ్వసిస్తున్నారు.
వ్యతిరేక ప్రచారం...
అందుకే ప్రశాంత్ కిషోర్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఆయన పై ఒకవర్గం మీడియా బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టింది. బీహార్ తరహా రాజకీయాలు చేయడంతో ప్రశాంత్ కిషోర్ దిట్ట అని, ఇటీవల చిరంజీవి, జగన్ భేటీ, ఆయనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలన్నది కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియానేనంటూ కొన్ని గంటల పాటు కొన్ని ఛానెళ్లు ఊదరగొట్టాయి. కానీ చిరంజీవి తాను అసలు చట్ట సభల్లోకే అడుగు పెట్టనని చెప్పడంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాయి.
గత ఎన్నికల్లో దెబ్బతో..
ప్రశాంత్ కిషోర్ ను టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా గత ఎన్నికల సమయంలో లైట్ గా తీసుకుంది. బీహార్ నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో ఆయన ఏం చేయలేడని నమ్మారు. అంతేకాదు చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు ప్రశాంత్ కిషోర్ ఎంత? అని కూడా తలలు ఎగురవేశారు. ఎవరి మాట వినని జగన్ పీకే సలహాలు పాటించడని కూడా అనుకున్నారు. కానీ ఫలితాలు దారుణంగా రావడంతో ఈసారి పీకే ఎంట్రీకి ముందే ఆయనపై బురద చల్లే కార్యక్రమం ప్రారంభమయింది. అసత్యాలను ప్రచారం చేస్తారని, కులాలు, మాతాలను చీల్చి లబ్ది పొందేలా పీకే వ్యవహరిస్తారని ఒక వర్గం మీడియా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story