జనసేనాని తొలి టార్గెట్ ఆ నాలుగే..!

జనసేనాని మలివిడత ప్రజా పోరాట యాత్రకు ప్రజల నుంచి తొలి విడత కంటే కాస్త స్పందన ఎక్కువే కనిపిస్తోంది. పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టిన పవన్ తనతో నడిచే వారిని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ యాత్రల్లోనే చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నాయకులు జనసేనలో చేరుతున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. అయితే పవన్ బలం ఏ జిల్లాలో ఎక్కడ? అంటే సందేహం లేకుండా మొదట వినిపించే పేరు తూర్పుగోదావరి. సామాజికవర్గ బలం దృష్ట్యా పవన్‌కు అత్యంత ఆదరణ లభించే జిల్లా ఇదే! కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాపై పవన్ ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
పవన్ వైపు చూస్తున్న కాపు సామాజికవర్గం
అంతేగాక అప్పుడే సీట్ల ఎంపికపైనా కసరత్తు ప్రారంభించారట. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను ఐదారు నెలల ముందు నుంచే మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాలపై పవన్ పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన సామాజికవర్గమైన కాపులు.. తమను నడిపించే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం అంటూ వచ్చినా.. తర్వాత ఆయన రాజకీయ అడుగులు గమనించి కొద్దిగా దూరమయ్యారు. ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ వైపు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి కాపులు అండగా నిలిచేలా చేయడంలో పవన్ పాత్ర ఎంతో ఉంది.
తూర్పు గోదావరిపై ప్రత్యేక దృష్టి...
పవన్ టీడీపీకి దూరమైన తరుణంలో.. రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే ముందుగా గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారాలని గ్రహించిన పవన్.. ఈ దిశగా అడుగులు ముందే చేపట్టారు. ముఖ్యంగా భౌగోళికంగా పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. గెలుపు, ఓటమిల విషయం పక్కనపెడితే ఈ జిల్లాలో 2019 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ కీలక నేత మారిశెట్టి రాఘవయ్య ఇప్పటికే జిల్లాలో పలుమార్లు పర్యటించారు.
తొలి దశలో నాలుగు నియోజకవర్గాలు...
పవన్ సామాజికవర్గమైన కాపులు ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో.. రాజకీయంగా బలపడేందుకు సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే తుని, పిఠాపురం, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాలపై తొలి దశలో ఫోకస్ పెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన తరపున ఎవరిని బరిలోకి దింపాలన్నదానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే కూడా నిర్వహించినట్టు చెబుతున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటైన వారిని పోటీకి దింపాలని ప్లాన్ వేసుకుంటున్నాడు.
కాకినాడ పరిధిలో బలంగా...
గతంలో పవన్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట నియోజకవర్గాల అభ్యర్థులు గెలుపొందారు. ఇంకా చెప్పాలంటే కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ నాడు ప్రజారాజ్యం, నేడు జనసేన కూడా బలంగా ఉన్నాయి. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం రెండో ప్లేస్‌లో నిలవడం విశేషం. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటి చేసిన చలమలశెట్టి సునీల్ నాడు మంత్రిగా ఉన్న పల్లంరాజుకు చెమటలు పట్టించి కేవలం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో రేపు పవన్ జనసేన ప్రభావం కూడా కాస్త అటూ ఇటూగా అంతే ఉండొచ్చని అంచనాకు రావొచ్చు.
బలమైన నేతల చేరికకు...
ఇక 2009 ఎన్నికల తర్వాత చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. పవన్ అభిమానులు, కేడర్ చెల్లా చెదురయ్యారు. అయితే ఇప్పుడు పవన్ జనసేనలోకి వీరంతా తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. తన అభిమానులు, జనసేన కార్యకర్తలు బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తన సత్తా చాటాలని పవన్ బలంగానే డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి సీట్లు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చలు నడుస్తున్నాయి.
