Mon Dec 15 2025 08:56:32 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఉంగరం.. భవిష్యత్ ను బొంగరంలా తిప్పుతుందా?
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేతికి పగడపు ఉంగరం కన్పించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

రాజకీయాల్లో, సినిమాల్లో సెంటిమెంట్ కు అగ్రనేతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎన్టీఆర్ హయాం నుంచి సెంటిమెంట్ లు రాజకీయాల్లో మరింత అధికమయ్యాయి. ముఖ్యంగా వెండితెర నుంచి వచ్చిన రాజకీయ నేతల విషయంలో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు తొలి నుంచి ఒకే డ్రెస్ కోడ్ మెయిన్ టెయిన్ చేస్తూ వస్తున్నారు. అలాగే పాదయాత్ర సమయంలో జగన్ వాడిన ఖాకీరంగు ప్యాంటు, తెలుపురంగు చొక్కాను జగన్ ఇప్పటికీ వదలలేదు. అది ఆయన సెంటిమెంట్ అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. జగన్ డ్రెస్ ను అనేక మంది మంత్రులు కూడా మెయిన్టెయిన్ చేస్తున్నారు.
చేతికి ఉన్న ఉంగరం....
ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బులుగు రంగు జుబ్బా, తెలుపు రంగు పైజమా వేసుకుని వస్తారు. కానీ నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ బ్లూ రంగు చొక్కా, యాష్ కలర్ ప్యాంటు వేసుకుని వచ్చారు. డ్రెస్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఉన్న చేతి ఉంగరం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పండితుల సూచనతో...
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఆయన వంటిపై ఎటువంట బంగారు ఆభరణాలు కన్పించవు. కాని నిన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేతికి పగడపు ఉంగరం కన్పించింది. ముఖ్యమంత్రి కావాలన్నా, వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలన్నా పగడపు ఉంగరం పెట్టుకోవాలని పవన్ కు కొందరు పండితులు సూచించారని తెలిసింది. అందుకే ఆయన పగడపు ఉంగరంతో నిన్న ప్రత్యక్షమయ్యారంటున్నారు. ఉంగరంతో పవన్ భవిష్యత్ బొంగరంలా మారుతుందని జనసేన అభిమానులు ఆనందపడుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ చేతికి ఉన్న ఉంగరం ఫొటో వైరల్ గా మారింది.
Next Story

