Sat Mar 28 2026 08:05:14 GMT+0530 (India Standard Time)
లవ్ స్టోరీకి ఎండ్ కార్డు ఎలా పడుతుందో?
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అంటే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారన్నమాట

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లవ్ స్టోరీలు నడుస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, వన్ సైడ్ లవ్ లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. లవ్ పండాలంటే అమ్మాయి అనుమతి అవసరం. మరి అమ్మాయి ఎవరు అంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ అని చెప్పక తప్పదు. పవన్ కల్యాణ్ అవసరం వైసీపీ మినహా అన్ని పార్టీలకూ కన్పిస్తుంది. పవన్ కల్యాణ్ తో జతకట్టాలని ఏపీలోని ప్రతి పార్టీ ఉవ్విళ్లూరుతుంది.
ప్రస్తుతం బీజేపీతో...
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అంటే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారన్నమాట. ఆ లవ్ ను కట్ చేసుకుని రావాలంటే పవన్ కు కష్టమే. ఎందుకంటే ఇన్ని సార్లు ప్రేమ.. బ్రేకప్ లను జనం అంగీకరించరు. అందుకే బీజేపీతోనే లవ్ ను కంటిన్యూ చేస్తూ టీడీపీతో అనుబంధాన్ని కొనసాగించాలి. అది సాధ్యమెలా? అన్నదే ప్రశ్న. పవన్ కల్యాణ్ కు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని లేదు. అలాగని దానితో కలసి ఉంటే బూడిద తప్ప ఏమీ మిగలదు.
టీడీపీతో కలవాలని ఉన్నా....
టీడీపీతో కలవాలని ఉంది. కానీ బీజేపీతో కలసి ప్రయాణం సాగించాలన్నది జనసేన అభిమతంగా ఉంది. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు అనేది ఉండకూడదని భావిస్తుంది. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోరాదన్నది బీజేపీ నేతల అభిప్రాయం. జనసేనతోనే కలసి వచ్చే ఎన్నికల్లో కాకపోయినా ఎప్పటికైనా ఏపీ సీఎం పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం. కానీ పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లోనే పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నారు.
పార్టీ నిర్వహణ....
ఇప్పటికే పార్టీ పెట్టి ఎనిమిదేళ్లవుతుంది. పార్టీని నడపటం అంత సులువు కాదు. అందుకే ఆయన అధికారాన్ని కోరుకుంటున్నారు. అధికారం దక్కాలంటే టీడీపీ అవసరం ఉంది. అలాగని పొత్తులతో వెంపర్లాడుతున్నట్లు కన్పించకూడదు. చంద్రబాబు ఆయనంతట ఆయనే పొత్తుల కోసం వచ్చేలా చూడాలి. ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమతం. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటుంది. మరి ఏపీ పొలిటికల్ పార్టీల లవ్ స్టోరీలో ఎండ్ కార్డు ఎలా పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- pawan kalyan
- tdp
Next Story

