షాకింగ్.. పవన్ గొంతులో జగన్ అనుకూల స్వరం..!

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం! ఎవరూ ఊహించని ఘటన.. ఎవరూ అనుకోని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గొంతులోంచి వైసీపీ అధినేత జగన్‌కు అనుకూల వ్యాఖ్యలు! ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. ఎవరూ అనుకోలేదు కూడా! ''డబ్బుతో రాజకీయాలు చేయాలనుకుంటే.. జగన్ ఏనాడో సీఎం అయ్యేవారు'' అంటూ పవన్ చేసిన ఒకే ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు జగన్‌ను విమర్శల మీద విమర్శలు చేశారు పవన్.! జగన్ కు సీఎం అయ్యే అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. సీఎం అయ్యేందుకు ఏం అర్హతలు ఉన్నాయని ప్రశ్నించాడు.
జగన్ దారిలో వెళుతున్నారా..?
అదే సమయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగుడుతూ.. కాలం గడిపేశాడు పవన్. ఇటీవల ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ఏనాటి నుంచో జగన్ మొత్తుకుంటున్నారు. బాబుపైకి కనిపిస్తున్నంత మంచి నాయకుడు కాదని, ఆయన తన స్వార్థం కోసం, తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం... ఎంతకైనా దిగజారుతారనే ఎప్పటికప్పుడు జగన్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక, ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి.. తన పబ్బం గడుపుకొంటున్న తీరును సైతం జగన్ ప్రతి సభలోనూ చెబుతున్నారు. అయినా.. జనసేనాని వీటిని పట్టించుకోలేదు. అంతేకాదు, ఏ వేదిక ఎక్కినా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారనే ఆరోపణలు తెచ్చుకున్నారు.
పవన్ సంకేతాలు ఇస్తున్నారా..?
అయితే, చంద్రబాబు గూటి నుంచి బయటకు వచ్చాక కానీ, పవన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసిరాలేదు. ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉందనే విషయాలన్నీ ఇప్పటికి గానీ తెలుసుకోలేక పవన్ తెలుసుకోలేక పోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన జగన్ వైఖరిని సమర్ధించారు. అందుకే.. డబ్బుతో గెలవాలని అనుకుని ఉంటే.. జగన్ ఏనాడో సీఎం అయ్యేవాడని అనడంలోని అంతరార్థం. నిజానికి నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఆ సీటును దక్కించుకునేందుకు చేసిన ప్రయాస, పారించిన నిదులు అన్నీ ఇన్నీ కావని అప్పట్లోనే మీడియా కోడై కూసింది. ఇక ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇక 2019 ఎన్నికల వేళ ఏదైనా జరగవచ్చు అనే దానికి ముందుగానే పవన్ సంకేతాలు పంపినట్లయ్యిందన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి.
