పవన్ కి సెంటిమెంట్ అదే ....!

ప్రపంచ ప్రసిద్ధ శ్రీనివాసుడి దయ తమపై ఉంటే తిరుగుండదని రాజకీయ పార్టీల అధినేతలకు బాగా సెంటిమెంట్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి వరకు తిరుమల వెంకన్న ను మొక్కే ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికి చంద్రబాబు సైతం అనేక కార్యక్రమాలను తిరుపతి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వచ్చింది. ఆయన ఏపీలో సుదీర్ఘంగా ప్రారంభించబోయే బస్సు యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అంతేకాదు తిరుమలలో సామాన్య కాటేజ్ లో బసచేసి మూడు రోజుల మకాం పెడుతున్నారు. అలిపిరి మెట్లదారిగుండా సన్నిధి చేరుకొని వేకువ జామున గోవిందుని దర్శనం అయ్యాక తన బస్సు యాత్ర వివరాలను ప్రకటించనున్నారు.
అత్యంత గోప్యంగా పవన్ తిరుమల పర్యటన ...
తిరుపతిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టిడిపి శ్రేణుల దాడి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ భద్రత కల్పించారు. తిరుమలలో మూడు రోజులు ఉండేందుకు వచ్చిన పవన్ నడకదారిలో తిరుమల వెళుతున్నారన్న సమాచారం లేనప్పటికీ ఆయన తిరుపతిలో అడుగు పెట్టగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పవన్ అడుగులో అడుగువేస్తూ సాగిపోయారు. బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటన తరువాత ఈనెల 15 న తిరుపతి నుంచి ఇచ్ఛాపురం పవన్ బయల్దేరి వెళ్ళనున్నారు జనసేనాని. పవన్ రాక సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పికె పర్యటనలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.
