జగన్, చంద్రబాబుపై పవన్ విసుర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లను దుమ్ము దులిపేశారు. ఇద్దరి మీద విమర్శలు సంధించారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఎవరిని వదలి పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడమే కాకుండా, 175 నియోజకవర్గాల్లో యాత్రను పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక హోదాకోసం ఆమరణ దీక్షకు కూడా దిగుతానని పవన్ ప్రకటించడం విశేషం.
బాబుకు మద్దతిచ్చి తప్పు చేశా.....
తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మద్దతిచ్చి తప్పు చేశానని, తనను క్షమించాలని పవన్ ప్రజలను కోరడం విశేషం. తాను కేవలం చంద్రబాబు సీనియారిటిని చూసే మద్దతిచ్చానని, భయపడి కాదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ రెండేనని వాటిని నమ్మ వద్దని ప్రజలను కోరారు. చంద్రబాబు చేసే ధర్మపోరాట దీక్ష నకిలీదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీపైన కూడా ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. అనేక చోట్ల జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అలా చేస్తే జనసేన చూస్తూ ఊరుకోదని కూడా జనసేనాని హెచ్చరించారు. టీడీపీనేతలు ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.
జగన్ ను నమ్మొద్దు......
ఇక వైసీపీ ప్రతిపక్షంలా వ్యవహరించడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాసమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్ష నేతకు అలవాటుగా మారిపోయిందన్నారు. ప్రజాసమస్యలను పరిష్కారం అయ్యే అసెంబ్లీని వదిలేసి ప్రజల వద్దకు వెళతానంటే ఎవరు నమ్ముతారన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఏ పనులు చేయడానికైనా ఆ పార్టీ నేతలు సిద్దంగా ఉన్నారన్నారు. తనకు ఐదు ఎమ్మెల్యేల సంఖ్య ఉండి ఉంటే ప్రభుత్వం సంగతి తేల్చేసేవాడినన్నారు. ఇలా పవన్ కల్యాణ్ బీజేపీ, వైసీపీ, టీడీపీలను తన ప్రసంగంలో తూర్పారపట్టారు. తనపై బీజేపీ ముద్ర వేస్తున్నారని, ప్రజలే తెలుసుకుంటారన్నారు. తాను ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు పవన్.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- prime minister
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రధాని
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
