పవన్ ను యాత్ర చేయనివ్వరా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఆయన గురువారం తన యాత్రకు విరామం ప్రకటించారు. తన సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ హీరోగా వెలుగొందిన పవన్ కల్యాణ్ పర్యటనకు జనం తాకిడి ఎక్కువగా ఉంది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అరకొరగానే ఉంది. దీంతో పవన్ ను చూసేందుకు వచ్చే అభిమానులను కట్టడి చేయలేకపోతున్నారు.
కవాతును అడ్డుకునేందుకు.......
మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ విమర్శల జోరు పెంచడంతో పవన్ కల్యాణ్ యాత్రకు ఆ పార్టీ అడ్డుతగులుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. టెక్కలిలో నిరసన కవాతును అడ్డుకునేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లారీలను అడ్డం పెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం నిరసన కవాతును చేస్తుంటే అడ్డుకోటమేంటని ఆయన మండి పడ్డారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని హెచ్చరించారు.
సెక్యూరిటీపై దాడి.....
మరోవైపు పవన్ కల్యాణ బసచేసిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్తును నిలిపేసి ఆయన సెక్యూరిటీపై దాడికి దిగారు. ఈ సందర్భంగా వారికి, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడిన 11 మంది సెక్యూరిటీ సిబ్బందిని పవన్ కల్యాణ్ వారి ఇళ్లకు పంపించి వేశారు. కిరాయి మూకలే తన సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డాయని పవన్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై అధ్యయనానికి తాను వస్తే ఇలా అడ్డుకోవడమేంటని నిలదీశారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో పవన్ గురువారం యాత్రకు విరామం ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యే నోటీసులు......
ఇదిలా ఉండగా జనసేనానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పలాసలో ఎమ్మెల్యే అల్లుడికి జీఎస్టీ కట్టాల్సిందేనంటూ ఆరోపణలు చేశారు. దీంతో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందరశివాజీ పవన్ కు నోటీసులు పంపారు. తనపైనా, తన అల్లుడిపైన పవన్ నిరాధార ఆరోపణలు చేశారని, దానికి క్షమాపణ చెప్పాలని శివాజీ డిమాండ్ చేశారు. పవన్ వాస్తవాలు తెలుసుకోకుండా, ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ ను చదువుతున్నారని శివాజీ ఆరోపించారు. మొత్తం మీద పవన్ పర్యటన ఉద్రిక్తతల మధ్యనే కొనసాగుతుంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha pary
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- palasa
- pavan kalyan
- tekkali
- telugudesam party
- uttarandhra
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఉత్తరాంధ్ర
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- టెక్కలి
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పలాస
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
