Fri Dec 05 2025 15:32:34 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ ఉల్లి రేటు కిలో రూ.1200లు.. ఇక్కడ రూ.2
భారత్ లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో ఉల్లిని రైతు నుంచి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు

భారత్ లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో ఉల్లిని రైతు నుంచి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. దిగుమతి ఎక్కువ కావడంతో ఉల్లి ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అయితే ఉల్లిని మార్కెట్ కు తీసుకు రాలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు. మార్కెట్ కు తీసుకు వస్తే ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
ధరలు పడిపోవడంతో...
ఒక్కసారిగా ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు మార్కెట్ కు తీసుకు వచ్చేందుకు కూడా వెనకంజ వేస్తున్నారు. దిగుబడి ఎక్కువ కావడంతోనే ఈ ధరలు పతనమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతు కంట కన్నీళ్లు వస్తున్నాయి. పెట్టుబడులు సంగతి అటుంచి మార్కెట్ కు తీసుకు వచ్చిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీని...
తాజాగా మహారాష్ట్రలో ఉల్లి సెగ అసెంబ్లీని తాకింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లి దండలు మెడలో ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రభుత్వమే రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతుల వద్ద నుంచి కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
ఫిలిప్పీన్స్ లో మాత్రం...
అయితే ఫిలిప్పీన్స్ లో మాత్రం ఉల్లి ధర కొండెక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో కిలో ఉల్లి ధర పన్నెండు వందల రూపాయలు పలుకుతుంది. చికెన్ కంటే ఉల్లి కొనుగోలు చేయడం కష్టంగా మారింది. ద్రవ్యోల్బణం కారణంగా ఫిలిప్పీన్స్ లో నిత్యావసర ధరలు నింగినంటాయి. ప్రజలు ఆ దేశంలో నిత్యావసరాలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉల్లి రెండు రూపాయలకు కొంటుంటూ అక్కడ రూ.1200లు విక్రయించడం నిజంగా విడ్డూరంగా ఉంది.
Next Story

