Fri Sep 13 2024 02:32:05 GMT+0000 (Coordinated Universal Time)
లెక్క.. తిక్క.. ఇదీ అసలు లెక్క
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న లాజిక్లను, లెక్కలను ఎవరూ నమ్మడం లేదు. విశ్వసించడం లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న లాజిక్లను, లెక్కలను ఎవరూ నమ్మడం లేదు. విశ్వసించడం లేదు. తాను పొత్తుకు డిసైడ్ అయిపోయి ఏదేదో చెప్పేస్తున్నట్లే ఉంది. పొత్తులు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని పవన్ కల్యాణ్ ఇటీవల కొత్త లాజిక్ తెచ్చారు. ఈ లాజిక్ జనసైనికులకే మింగుడుపడటం లేదు. రాజకీయ అవగాహన లేదనుకున్నారా? తానే అదే ఇబ్బందితో ఉన్నారా? అర్ధం కావడం లేదు. పొత్తులు లేకుండా భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రాలేదు. అదే సమయంలో పొత్తులు కుదుర్చుకుని ఎటూ కాకుండా పోయిన పార్టీలు ఎన్ని లేవన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పొత్తుల వల్లనే బలోపేతం...
ఇటీవల కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పొత్తుల వల్లనే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. అందులో బీఆర్ఎస్, బీజేపీలను ఉదహరించారు. ఆ రెండు పొత్తుల వల్లనే బలోపేతమయ్యాయని, తర్వాత అధికారంలోకి వచ్చాయని పిచ్చి లాజిక్‌ను పవన్ తెరపైకి తెచ్చారు. నిజానికి ఈ లెక్కల్లో పెద్ద తప్పిదాలే ఉన్నాయి. బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ గా ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. ఉమ్మడి రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్, టీడీపీలను ఎదుర్కొనాలంటే తన శక్తి చాలదు. సెంటిమెంట్‌తో కొట్టాలి. అంతేకాదు. ప్రత్యేక రాష్ట్ర సాధనను శాసనసభ, అటు పార్లమెంటులో వినిపించాలి. అందుకే ఒకసారి కాంగ్రెస్‌తోనూ, మరొకసారి టీడీపీతోనూ కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఆప్, తృణమూల్ కాంగ్రెస్...
ఇక ఢిల్లీ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందని అధికారంలోకి వచ్చిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లోనూ ఒంటరిగానే పోటీ చేసి పవర్‌ను చేజిక్కించుకుంది. అంతే తప్ప ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇక తృణమూల్ కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్లో బలమైన కమ్యునిస్టులను, కాంగ్రెస్‌లతో పోరాడి మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. అది కూడా ఎవరితో పొత్తుకు దిగలేదన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. కేవలం నాయకత్వం పటిష్టంగా ఉండటం, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోగలిగితే అధికారం దానంతట అదే వస్తుంది. ముఖ్యంగా ప్రజల్లోనూ, క్యాడర్‌లోనూ విశ్వాసం కలిగించాలి. అదే పవన్ కల్యాణ్‌లో లోపం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎస్పీ, బీఎస్పీ....
ఇక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ పార్టీ కూడా పొత్తులు పెట్టుకుని ఇప్పుడు ఎటు కాకుండా పోయాయని అంటున్నారు. చివరకు బద్ధ శత్రవులైన బీఎస్పీ, ఎస్పీ కలిసినా కూడా ప్రజలు వారికి జై కొట్టలేదు. అంతెందుకు వందేళ్లకు పైగానే చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకునే ఈ స్థితికి వచ్చిందనే వారు కూడా లేకపోలేదు. ఇవన్నీ గమనించకుండా ఏదో రెండు ఉదాహరణలు చెప్పేసి పవన్ కల్యాణ్ తాను పొత్తు పెట్టుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని క్యాడర్‌పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నది ఇట్టే అర్థమవుతుంది. పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు. రాజకీయాల్లో అది సహజమే. కానీ క్యాడర్‌ను తప్పు దోవ పట్టించేలా తప్పుడు ఉదాహరణలు చెప్పి సైడ్ ట్రాక్ పట్టించాలనుకోవడమే ఆయన చేస్తున్న తప్పిదం. ఇవన్నీ ఇప్పటికైనా తెలుసుకుని ముందు పార్టీ బలోపేతానికి కృషి చేయడం మంచిదన్న కామెంట్స్ వెలువడుతున్నాయి.
Next Story