అక్కడ ఈ సారైనా జగన్ జెండా ఎగురుతుందా...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతోంది. జిల్లాలో రాజమండ్రి లోక్‌సభ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గం కొవ్వూరు, తణుకుతో పాటు రద్దయిన పెనుగొండ నియోజకవర్గంలోని మండలాలతో ఏర్పడింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో జరిగిన తొలి రెండు ఎన్నికల్లోనూ టీడీపీయే గెలిచింది. ఇక్కడ నుంచి శశి విద్యాసంస్థల ఫ్యామిలీకి చెందిన బూరుగుపల్లి శేషారావు వరుసగా రెండుసార్లు గెలిచారు. 2009లో ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లతో జరిగిన ముక్కోణపు పోటీలో 6వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచిన ఆయన గత ఎన్నికల్లో కూడా మళ్లీ 6 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతోనే గెలిచారు.
వరుసగా రెండుసార్లు గెలిచి...
కొవ్వూరు, తణుకు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రాంతాల నుంచి ఏర్పడిన నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ బలంగానే ఉంది. రెండుసార్లు గెలిచిన శేషారావుపై ఈ సారి కాస్తో కూస్తో వ్యతిరేకత కనపడుతోంది. అయితే టీడీపీ ఇలా ఉంటే వైసీపీ మాత్రం చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణబాబు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన చనుమోలు రాజీవ్‌కృష్ణ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు.
శేషారావుకు పాత ప్రత్యర్థే...
ప్రస్తుతం వైసీపీ నుంచి జగన్.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్.రావు తనయుడు జీ.శ్రీనివాసులు నాయుడుకు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు. ఇంతకు శ్రీనివాసులు నాయుడు గతంలో శేషారావు మీద కాంగ్రెస్ నుంచి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. మధ్యలో సైలెంట్ అయిన ఆయన తిరిగి ఇప్పుడు నిడదవోలు వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో 2009లో ఇక్కడ ఓడినప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరమవ్వడం ఆయనకు మైనస్‌గా మారింది.
అగ్ని పరీక్షేనా..?
నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా చూస్తే కమ్మలతో పాటు కాపులు కూడా రాజకీయంగా బలంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు కమ్మ వర్గం కాగా....శ్రీనివాసులు నాయుడు కాపు. ప్రస్తుతం జగన్ శ్రీనివాసులు నాయుడుకు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చినా వైసీపీ నుంచి కమ్మ వర్గానికి చెందిన ఒకరిద్దరు కూడా రేసులో ఉన్నారు. శ్రీనివాసులు నాయుడుకు ఇక్కడ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం పెద్ద అగ్నిపరీక్షే.
2009లో ప్రజారాజ్యం దెబ్బ... 2019లో లెక్కేంటి...
ఈ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం ఎంట్రీతో కాపులు ఎక్కువుగా ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపారు. దీంతో అదే వర్గానికి చెందిన శ్రీనివాసుల నాయుడు ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎంట్రీ ఇస్తుండడంతో మళ్లీ కాపుల్లో ఎక్కువ మంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపితే ఇప్పుడు అదే వర్గం నుంచి శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తే మళ్లీ గెలుపు సులువు కాదు. ఈ క్రమంలోనే జగన్ ఇక్కడ సరైన సమీకరణలతోనే ముందుకు వెళితే విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయి.

