Wed Jun 29 2022 05:59:09 GMT+0000 (Coordinated Universal Time)
అంత తేలిగ్గా వదులుతారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. ఆయన పార్టీ పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే విజయం అవసరం. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆయన ఒంటరి పోరుకు సిద్ధపడరు. ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరికైనా ఇది తెలుస్తుంది. బీజేపీ అండ లేకపోయినా జనసేన మద్దతును చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గంతో పాటు యువత మద్దతు పార్టీకి లభిస్తే జగన్ ను సులువుగా ఓడించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.
పొత్తులతోనే...
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన సభలకు వస్తున్న జనాలను చూసి మురిసిపోరు. ఆ జనం ఎలా వచ్చారన్నది ఆయనకు తెలియంది కాదు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు పొత్తులనే కోరుకుంటారు. అయితే ఇందుకు జనసేన నుంచి గట్టిగా వస్తున్న డిమాండ్ పై కూడా ఆయన చివరి నిమిషంలో ఆలోచన చేయవచ్చు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసి రెండోసారి జగన్ కు అధికారం అప్పగించి మరో ఐదేళ్లు ఇబ్బంది పడేంత తెలివి తక్కువ రాజకీయ నేత చంద్రబాబు కాదన్నది అందరికీ తెలిసిందే.
తాను తప్పుకుని...
అందుకే చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి. అయితే ఇది బహిరంగంగా చెప్పకుండా కేవలం పార్టీల మధ్యనే పొత్తుల చర్చల మధ్య ఉంటాయంటున్నారు. టీడీపీ, జనసేన రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకునే తరహాలో ఆయన ఆలోచన ఉంటుందంటున్నారు. తొలి దఫా టీడీపీ, రెండో దఫా పవన్ కు సీఎం పదవి చేపట్టేలా అంగీకారం కుదుర్చుకునేలా చంద్రబాబు ఆలోచిస్తున్నారని కూడా చెబుతున్నారు.
లోకేష్ ను సీఎంగా.....
తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్నది ఆయన ఆలోచన. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం పదవి పై తనకు ఎలాంటి ఆశలేదని పదే పదే సభల్లో చెబుతున్నారు. లోకేష్ చేత పాదయాత్ర చేయించి నాయకుడిగా మరింత ఎదగనిచ్చి అనంతరం ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఎటూ పొత్తుల్లో సీట్ల సంఖ్య టీడీపీకి ఎక్కువగానే ఉంటుంది. గెలిచిన సభ్యుల్లో టీడీపీ బలమే ఎక్కువగా ఉంటుంది. జనసేనకు నలభైకి మించి సీట్లు ఇవ్వరు. అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఆయన తెరపైకి తెస్తారని పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story