జగన్ విలన్ ను చేసేందుకు బాబు....?

లక్షల మంది కార్యకర్తలు...ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు.. అయితే ఆయన మళ్లీ పాత పాటే పాడేశారు. మోడీని ఎంత టార్గెట్ చేశారో వైసీపీని కూడా అదే విధంగా ఎండగట్టారు. తిరుపతి ధర్మపోరాట సభలో చంద్రబాబు ప్రధానంగా ఈ ఇద్దరిపైనే నిప్పులు చెరిగారు. ఒకరు ఏపీకి ద్రోహం చేశారంటూ మోడీపైనా, ద్రోహితో చేతులు కలిపారంటూ జగన్ పైన ఆయన నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలనూ చిత్తుగా ఓడించమని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లలోనూ సమావేశం.....
తిరుపతి ధర్మపోరాట దీక్ష తర్వాత వరుసగా అన్ని జిల్లాల్లో ఇదే తరహా సమావేశాలను పెట్టనున్నారు. మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల వీడియోలను బహిరంగ సభల్లో ప్లే చేసి మరీ ప్రజలకు వివరిస్తున్నారు. తిరుపతి సభ సక్సెస్ అయిందని టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారు. తిరుపతి, అనంతపురం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో తిరుపతిలోని తారకరామస్టేడియం కిక్కిరిసిపోయింది. ఈదురుగాలులు, వర్షం వచ్చినా కార్యకర్తలు వెనుదిరగలేదు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యే వరకూ ఓపిగ్గా కూర్చున్నారు.
నమ్మకద్రోహితో చేతులు కలిపి.....
ఏపీకి అన్నివిధాలుగా అన్యాయం చేశారని మోడీని ఒకవైపు తిడుతూనే వైసీపీ అధినేత జగన్ ను కూడా విలన్ గా చిత్రీకరించే యత్నం చేశారు చంద్రబాబు. జగన్ నమ్మకద్రోహితో చేతులు కలిపారన్నారు. తాను మోడీపై పోరాడుతుంటే, జగన్ మాత్రం తనపై పోరాటడమేమిటని ప్రశ్నించారు. మోడీని నిలదీయాల్సిన జగన్ రాష్ట్రాభివృద్ధి జరగకుండా కుట్రలకు తెరలేపారన్నారు. వీళ్లకు సిగ్గులేదని కూడా చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాతిక మంది ఎంపీలను తనకిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు.
పవన్, జగన్ లు....
వచ్చే ఎన్నికల్లో సయితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న చంద్రబాబు తనకు ఓట్లేసి సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేసుకుంటారా? లేక జగన్ కు ఓట్లేసి స్కామాంధ్రకా మార్చుకుంటారా అన్నది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించాలంటే వైసీపీ, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ అయితే తమ చెప్పుచేతల్లో ఉంటాడని బీజేపీ భావిస్తుందన్నారు. మొన్నటిదాకా మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇంతకు మించి కుట్ర జరిగిందనడానికి కారణాలేంకావాలని ఆయన ప్రశ్నించారు. అలా చంద్రబాబు జగన్ ను విలన్ చేసే యత్నంలో పడ్డారు. మరి సక్సెస్ అవుతారా? లేదో? అన్నది చూడాలి.
