నిర్మొహమాటంగా మోడీ ముందే...బాబు...!

ఆంధ్రప్రదేశ్ సమస్యలు, విభజన హామీలతో పాటు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాలతో ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో నిర్మొహమాటంగా చెప్పేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు సుమారు 20 నిమిషాలు ప్రసంగించారు. ప్రతి ముఖ్యమంత్రికి ఏడు నిమిషాలు మాత్రమే కేటాయించినా, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మధ్యలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు తన ప్రసంగాన్ని చివర వరకూ కొనసాగించడం విశేషం.
హామీలు అమలు చేయకుండా.....
ఏపీ విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నియంతలాగా వ్యవహరిస్తుందని చంద్రబాబు సమావేశంలో ఆరోపించారు. ప్రజలు విభజన కోరుకోకున్నా అడ్డగోలుగా విభజన చేసి, హామీలను అమలు చేయకుంటే ఎలా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినా దానికి నిధులు సక్రమంగా విధులు చేయకపోవడంపై మండిపడ్డారు. అమరావతి నిధుల విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆసక్తిగా విన్న మోడీ.....
ఇకప్రత్యేక హోదా ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలని కోరారు. జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండిపడుతుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశమంతటా పడిందని, డబ్బులు దొరక్క సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తం మీద చంద్రబాబు తన ప్రసంగాన్ని 20 నిమిషాలు ఏకబిగిన కొనసాగించారు. చంద్రబాబు ప్రసంగాన్ని మోడీ ఆసక్తిగా విన్నారు.
