కలెక్టర్లకే కథ చెప్పిన బాబు ...!

"రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. నాకన్నా దేశంలో సీనియర్ రాజకీయ నేత లేరు. నేను రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నా. దేశం లో అన్నిట్లో నేనే నంబర్ వన్. సెల్ ఫోన్ తెచ్చింది నేనే. కంప్యూటర్ పరిచయం చేసింది మనమే. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతిని చేసింది, అలాగే ప్రధానులు ఎవరుండాలని శాసించింది మనమే". ఇవన్నీ తరచు పార్టీ క్యాడర్ కి, ప్రజలకు, అధికారులకు సభలు సమావేశాల్లో ప్రభోదిస్తూ తన కెపాసిటీ, క్యాలిబర్ ఎలాంటిదో స్వయంగా ప్రకటించుకోవడంలో ఎపి సీఎం చంద్రబాబు ను మించిన వారు లేరని విశ్లేషకులు తరచూ అంటుంటారు. పరనింద ఆత్మస్తుతి అన్నవి నేటి రాజకీయాలు అయితే అందులో బాబు పిహెచ్ డి కి మించి చేసేసారు. వీటిలో ఆయనతో పోటీ పడే నేత దేశంలో ఎవరు లేరనే చెప్పాలి. తాజాగా అమరావతిలో కలెక్టర్లకు బాబు తాను రాష్ట్రం కోసం ఎలా కష్టపడేది ఒక కథగా చెప్పి ఔరా అని వారిచేత అనిపించుకున్నారు.
బాబు చెప్పిందేమిటంటే ...?
అమరావతి రాజధాని ఎపి సీఎం డ్రీం ప్రాజెక్ట్. ఎప్పటికైనా తన ఊహా చిత్రం నిజం కావాలని ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అవుతుందని సంకల్పించి నాలుగేళ్ళుగా బాబు తిరగని దేశం పరిశీలించని ప్రాంతం లేదనే రీతిలో తిరిగారు. హైదరాబాద్ కోల్పోవడంతో దానికి ధీటైన రాజధాని చంద్రబాబు మాత్రమే నిర్మిస్తారని ఎపి లో ప్రజలు గత ఎన్నికల్లో బలంగా నమ్మి ఓట్లేశారు. అందుకు తగ్గట్టే ఆయన అమరావతి డిజైన్ల ఖరారు కోసం నాలుగు సంవత్సరాలు అదే పనిలో వున్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఆకృతులు రూపొందించే నార్మన్ పోస్టర్స్ కు అమరావతి డిజైన్ల బాధ్యతలు అప్పగించారు. దానికోసం లండన్ సైతం వెళ్ళారు. తన బృందాలను పంపించారు. అమరావతి డిజైన్లను నార్మన్ పోస్టర్స్ పలుసార్లు ప్రదర్శించింది. చివరికి కొన్ని మార్పులతో ఫైనల్ చేశారు బాబు. తాజాగా ఆ డిజైన్లు రూపొందించిన నార్మన్ పోస్టర్ ఒడిస్సా లో పనిపై వచ్చి ఎపి సీఎం ను కలవాలనుకున్నారు. ఆయన ఆడబిడ్డ రక్షణ కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోయారు. నార్మన్ పోస్టర్ స్వయంగా వచ్చిన విషయాన్నీ ఆలస్యంగా అధికారులు బాబుకి తెలియచెప్పడంతో ఆయన అంత బిజీ లోను ఆ కార్యక్రమం ముగించుకుని ఎయిర్ పోర్ట్ కి బయల్దేరి వెళ్లారు. వెళ్ళిన వెంటనే పోస్టర్ ను కలిసి ముచ్చటించారు. ఆయన్ను స్వయంగా విమానం ఎక్కించారు.
నాకెందుకు ఈ ఆరాటం ...?
"క్షణం తీరికలేని పనుల్లో వున్నా నాకు ఎందుకు ఈ ఆరాటం. నార్మన్ పోస్టర్ వచ్చి వెళితే ఏమైంది ? నేనెందుకు ఎయిర్ పోర్ట్ వరకు హైరానా పడి వెళ్ళాలి. ఇదాంతా నాకోసం కాదు రాష్ట్రం కోసం అని మీరు గుర్తుంచుకోండి. అమరావతి ని అత్యంత సుందరంగా ప్రపంచంలో తలమానికంగా తయారు చేయాలనే సంకల్పం వల్లే నేను దానికి సహకరించిన వారితో ఎన్ని పనులు వత్తిళ్లు వున్నా పరిగెడుతున్నా. ఆ స్ఫూర్తి మీరు అంది పుచ్చుకోవాలి. నా ఇంట్లో ఉదయం లేచి చూడగానే సుందరమైన నది కనిపిస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత అందం దేశంలోనే ఎక్కడా లేదు. దానికి సహకరించే వారిని మనం గౌరవించాలిసిన బాధ్యత ఉంది"అన్నారు చంద్రబాబు. ఒక టీం గా పని చేస్తే రాష్ట్రం ధనిక రాష్ట్రాలకన్నా అగ్రగామిగా నిలబడుతుంది అంటూ గీతోపదేశం చేశారు బాబు.
మంత్రుల అసంతృప్తి ... బాబు సంతృప్తి ..!
రెండు రోజులపాటు అమరావతిలో సాగిన కలెక్టర్ల సదస్సు లో విచిత్ర పరిస్థితి ఎదురైంది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, మంత్రి అచ్చెన్నాయుడు వంటివారు కలెక్టర్ల పనితీరుపై బాహాటంగానే విమర్శల వర్షం కురిపించారు. యంత్రాంగం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ధ్వజమెత్తారు. రెవెన్యూ శాఖ లోపాలను కేఈ , రోడ్లు పలు అంశాలపై అచ్చెన్న సీరియస్ గా చర్చించారు. మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి మాత్రం కలెక్టర్ల పై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతంగా పనిచేస్తున్నారని ఇంకా చేయాలని ఒక టీం గా కృషి చేద్దామంటూ వారిని ఉత్సహపరిచారు. రాష్ట్రంలో 90 శాతం పైగా ప్రజలు సంతృప్తి అని బాబు స్లోగన్ అందుకుంటే మంత్రులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
