కిరణ్ కండిషన్ ఇదేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనతో దాదాపు గంటన్నర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉమెన్ చాందీకి తన మనసులో మాటను కిరణ్ చెప్పినట్లు తెలిసింది. తాను జాతీయ రాజకీయాల్లోనే ఉంటానని, రాష్ట్ర రాజకీయాల్లో పాలు పంచుకోబోనని చెప్పినట్లు తెలిసింది.
జాతీయ స్థాయి పదవి......
కాకుంటే ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం మాత్రం చేస్తానని, తనకు జాతీయస్థాయిలో పదవి ఇస్తామని హామీ అధిష్టానం నుంచి వస్తేనే పార్టీలోకి వస్తానని ఆయన కండిషన్ పెట్టారంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధిష్టానంతో చర్చించిన తర్వాత తెలియ చేస్తానని ఉమెన్ చాందీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు పార్టీలో పదవి ఇచ్చి గౌరవించాలని భావిస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరే విషయంపై త్వరలోనే తాను స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. కిరణ్ త్వరలోనే పార్టీలో చేరతారని ఉమెన్ చాందీ ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు కూడా కిరణ్ త్వరలోనే పార్టీలో చేరతారని చెప్పారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. త్వరలోనే రాహుల్ ను కలిసి కిరణ్ పార్టీలో చేరే అవకాశముందంటున్నారు.
