Sat Oct 12 2024 15:19:18 GMT+0000 (Coordinated Universal Time)
పూల పరిమళాన్ని మిగిల్చి...లత వెళ్లిపోయింది
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంతో సంగీత ప్రపంచం మూగవోయింది. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది
ఒక్కోసారి మీడియా మీద కోపం వస్తుంది. టీవీలను నేలకేసి బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఒక్కళ్లం కూర్చుని భోరున విలపించాలనిపిస్తుంది. విన్నవి, చూసిన కొన్ని... నిజాలు కాకపోతే బాగుండునని భగవంతుడ్ని కోరాలనిపిస్తుంది. ఇలా దేశంలో అందరికీ అనిపించిందంటే తీతువు ఎక్కడో అరుస్తోందని తెలుస్తుంది. ఆ అరుపులు ఓ విషాదాన్ని మోసుకొస్తున్నాయని తెలిసుకున్న జాతీయ జెండా సైతం తనకు తానే అవనతం అవుతుంది. ఇదంతా ఈ రోజే ఉదయం 8 గంటల 12 నిమిషాలకు జరిగింది. హాయిగా గడపాలనుకున్న ఆదివారం చీకటి రోజుగా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంతకీ ఈ సమయంలో ఏం జరిగింది. దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా పాటల పూదోట హఠాత్తుగా వాడిపోయింది. అవును, పాటల నెలరాణి లతా మంగేష్కర్ ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ గొంతులో.....
ఆ గొంతులో ఏముంది అంత ప్రేమించడానికి. ఆ గొంతులో ఏముంది అంత గౌరవించడానికి. ఆ గొంతులో ఏముంది ఇంత బాధపడిపోవడానికి. ఏం లేదు. ఆ గొంతులో వీణ చేతిలో పట్టుకుని గానానికి ప్రాణం పోసిన అపర సరస్వతి కూర్చుని ఉంది. అంతే.. ఇంకేం లేదు. ఇందుకే ఈ వగపంతా. ఇందుకే ఈ దుఖమంతా. ఇందుకే ప్రతి గొంతు మాట రాక పూడుకుపోయింది. ఏడు దశాబ్దాల క్రితం, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మజ్ బూర్ చిత్రంలో గొంతు ముడివిప్పారు లతా మంగేష్కర్. మజ్ బూర్ అంటే నిస్సహాయత. అవును, తల్లీ నిస్సహాయులమే నీ ముందు, నీ గొంతు ముందు. బానిసలం అయిపోయాం కదమ్మా నీ గానానికి.
అవార్డులన్నీ విలపిస్తున్నాయి....
మమ్మల్నీ ఆ నిస్సహాయత నుంచి దూరం చేయడానికి నువ్వే అన్నావు కదా... అచ్చ తెలుగులో "నిద్దుర పోరా తమ్ముడా... నిద్దుర పోరా తమ్ముడా... నిదురలోనే గతమునంతా నిమిషమైనా మరచి పోరా" అని చెప్పావు కదా... కాని ఎలా సాధ్యం తల్లీ.. నువ్వు లేవని తెలిసి నిదురపోవడం ఈ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అమ్మలకు, నాన్నలకు... ఎలా సాధ్యం తల్లీ. అదిగో భారతరత్న గుక్కపట్టి ఏడుస్తోంది. అంతకు ముందే పద్మవిభూషణ్ కూడా గుండె పగిలేలా రోదిస్తోంది. నీకొచ్చిన అవార్డులన్నీ కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్నాయమ్మా. నువ్వు రాకముందు పిల్లల్ని నిదురపుచ్చేందుకు పాడే పాటలన్నీ నీ రాకతో స్వరం మార్చుకున్నాయి. నీ పాట వినిపిస్తూ ఎన్ని లక్షల మంది తల్లులు పిల్లలకు గోరుముద్దలు తినిపించారో. నీ పాట వింటూ ఎన్ని లక్షల మంది ప్రేమ జ్వరం నుంచి బయటపడ్డారో. నువ్వే అన్నావు కదా తల్లీ అమాయకంగా మాసూమ్ సినిమాలో...
తుస్సే నారాజ్ నహీ జిందగీ
హేరానుహుమే.. హేరానుహుమే...
నిజమే నువ్వున్నదమ్మా... మా మీద నీకు కోపం కాని అలక కాని లేదమ్మా... మాకు తెలుసు తల్లీ... మాకే నువ్విక లేవని తెలిసి ఓ నిరాశలో కూరుకుపోయాం అంతే. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాయో ఎన్ని వేల పాటలు నీ గొంతులో తడిసి పునీతమయ్యాయో... ఎంత మంది సంగీత దర్శకుల జీవితాలు సార్ధకమయ్యాయో నీ చేత పాటలు పాడించుకుని. నీ పాట వింటూ మేమంతా ఒక ప్రపంచానికి రెప్ప మూసి... మరో ప్రపంచానికి రెక్కలు విప్పుకుంటు ఎగిరిపోయామో... అయినా నువ్వు లేవని అంటారేమిటమ్మా... నువ్వే అన్నావు మమతా సినిమాలో పాడిన పాటలో... బతికున్నా... లేకున్నా... ఓ పువ్వులా మారి పరిమళించడం ఉదయాన్నే వీచే చల్లని గాలిలా పరివ్యాప్తించడం... అవునమ్మా.... లతలా వెళ్లిపోయావు... సుగంధ పరిమళ పువ్వులా.... మేం బతికేందుకు పిల్చుకునే గాలిలా మాలో మిగిలిపోయావు. ఇంకా రాయాలని ఉన్నా... కాలం కరిగిపోవడం లేదు... కలం కదలనివ్వడం లేదు.
- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, 9912019929
Next Story