Sat Dec 14 2024 15:46:45 GMT+0000 (Coordinated Universal Time)
బాబును సీఎం కానివ్వరటగా?
ముద్రగడ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. అదే జరిగితే టీడీపీకి నష్టమని అంచనాలు వినపడుతున్నాయి.
ముద్రగడ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. ఆయన దళిత, బీసీ లను కలుపుకుని ఒక కొత్త పార్టీని ఏపీలో నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లే ఉంది. కాపులు ఒక్కరే రాజ్యాధికారాన్ని సాధించలేరని, బీసీ, ఎస్సీలను కలుపుకుని వెళితే ఖచ్చితంగా అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన దళిత, బీసీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు ఆయన లేఖలను బట్టి తెలుస్తోంది.
జనసేన, టీడీపీ....
ఒకవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ, జనసేన పొత్తులతో వచ్చే ఎన్నికలకు ముందుకు వెళతాయని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు కూడా పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. జనసేన కూడా దాదాపు అదే ఆలోచనలో ఉంది. జనసేన అంటేనే కాపులు మద్దతిచ్చే పార్టీ. పవన్ కల్యాణ్ కు అన్ని కులాలు, మతాల్లో అభిమానులున్నా, ఆ పార్టీకి కాపు ముద్ర పడిపోయింది. కాపుల ఓట్లను చీల్చేందుకు ముద్రగడ కొత్త పార్టీ పెడుతున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.
ఆ రెండు జిల్లాలను ముద్రగడ ...?
పవన్ కల్యాణ్ ప్రభావం కేవలం రెండు జిల్లాల్లోనే ఉంటుందని వైసీపీనేతలు అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఆయనకు క్యాడర్ కాని, ఓటు బ్యాంకు కాని ఉంది. రెండు పెద్ద జిల్లాలు. మిగిలిన ప్రాంతాల్లో ప్రభావం చూపగలిగే స్థాయిలో జనసేన లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం కూడా. టీడీపీ, జనసేన కలిసినా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ కూటమిని దెబ్బతీయడానికి ముద్రగడ కొత్త ప్లాన్ వేశారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
కాపు నేతగా....
నో డౌట్.. ఎవరు అవునన్నా, కాదన్నా ముద్రగడ పద్మనాభంకు ఆ రెండు జిల్లాల్లో కాపు సామాజికవర్గంలో పట్టుంది. ఆయనను తమ నాయకుడిగా ఇప్పటికీ 80 శాతం మంది కాపు ప్రజలు చూస్తారు. ఆయన పార్టీ పెడితే కాపు కులం ఓట్లలో చీలిక రావడం ఖాయం. అది మరోసారి వైసీపీకి అనుకూలంగా మారేదీ ఖాయమే. ముద్రగడ పద్మనాభంకు తొలి నుంచి చంద్రబాబు పొడ గిట్టదు. బాబు జనసేనతో లవ్ ట్రాక్ ప్రారంభించిన తర్వాత ముద్రగడ తన ట్రాక్ ను కూడా వేగంగా మార్చుకుంటూ వస్తున్నారని టీడీపీ అనుమానిస్తుంది. మరి ముద్రగడ కొత్త పార్టీ పెడతారా? లేదా? అన్నది పక్కన పెడితే టీడీపీకి మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Next Story