మోడీ అస్సలు ఊరుకోరు....!

ప్రధాని నరేంద్ర మోడీ మొండోడు. ఊరుకుంటాడా? తనపై మాటల దాడి చేస్తున్న వారిని ఉపేక్షిస్తారా? అందుకే బీజేపీ ఏపీలో సొంతంగా బలం పెంచుకోవడానికి సిద్ధమవుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ఇన్నాళ్లూ ప్రచారం చేసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను నేరుగా కలెక్టర్లే ప్రచారం చేసేలా ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించడం విశేషం. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభంకానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలో ఈ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర సర్కార్.
కేంద్ర ప్రభుత్వ పథకాలను....
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాటిని తమవి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీలోనూ అదే జరుగుతుందన్నది బీజేపీ ఆరోపణ. చంద్రన్న బీమా, చంద్రన్న కానుకలు, దీపం పథకం వీటికోవలోకి చెందినవేనని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి విరుగుడుగా ఇప్పుడు కేంద్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, సిబ్బంది చేత ఊరువాడా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. దీనికి గ్రామీణ స్వరాజ్ అభియాన్ యోజన అని నామకరణం కూడా చేసేశారు. కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కేంద్రం ఈ మేరకు రంగంలోకి దిగింది.
ఏపీలో 305 గ్రామాల్లో.....
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా దీనిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వాలు లేకపోవడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టాలని భావించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. తొలివిడతగా ఆంధ్రప్రదేశ్ లోని 305 గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. గ్రామసభలను ఏర్పాటు చేసి కేంద్రం ఎంత నిధులు ఏ పథకం కింద ఇస్తుంది? రాష్ట్రం ఏ విధంగా వాటిని వాడింది? వివరంగా తెలియపర్చాల్సి ఉంటుంది. విద్యుత్తు, గ్యాస్ సబ్సిడీ, ఉజాలా యోజన, పీఎం ధన్ జన్ యోజన వంటి పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వివిధ పథకాల కింద నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటూ కేంద్రాన్ని బదనామ్ చేయాలని చూస్తున్నాయని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కన్పిస్తోంది. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
