మోడీ షాకింగ్ డెసిషన్

దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కేంద్రం సంకల్పించింది. అందుకోసం ఫోక్సో చట్టానికి కేంద్ర కేబినెట్ సవరణలు చేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించి కేబినెట్ లో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతికి చట్ట సవరణ కు ఆమోదం తెలపడానికి నివేదించనుంది. ఈ కొత్త చట్టం ప్రకారం 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణదండన విధించేలా కొత్త చట్టం రూపుదిద్దుకుంది.
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ...
చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు నమోదైన కేసుల్లో ఇకపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఏర్పాటు అవుతాయి. ఈ కేసులను సత్వర విచారణ జరిపి నేర నిర్ధారణ జరిగితే ఉరిశిక్ష గరిష్టంగా అమలు చేస్తారు. దేశంలో మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఉరిశిక్ష అమలు చేయాలని ఎంతో కాలంగా మహిళా సంఘాల నుంచి డిమాండ్ వుంది. మహిళలపై అత్యాచార సంఘటనల కేసుల విచారణ కూడా సుదీర్ఘంగా సాగడం బాధితులు పై వత్తిడులు ఎదురై రాజీ కుదిరి నిందితులు తప్పించుకోవడం, సాక్ష్యాలు తారుమారు కావడం రొటీన్ గా మారింది. ఉరిశిక్ష ను అమలు చేయడంతో బాటు త్వరితగతిన విచారణ ఈ కేసుల్లో అత్యంత అవసరమని కేంద్రం భావించింది. వివిధ సంఘాలనుంచి వచ్చిన విన్నపాలు, ప్రజా ఉద్యమాల్లో వెల్లువెత్తిన నిరసనలతో కీచకుల పీచం అణచివేసేందుకు రాబోతున్న కొత్త చట్టం అయినా ఈ నేరాలు ఘోరాలు కొంతైనా నియంత్రిస్తుందో లేదో చూడాలి.
మీడియా .సోషల్ మీడియా పై ఆంక్షలు ఉండాలి ...
సింగపూర్ వంటి దేశాల్లో చిన్న రక్తపాతం వున్నా 16 ఏళ్ళ లోపు చిన్నారులకు సినిమాహాల్లో ప్రవేశం నిషేధం. భారత్ లో ఇలాంటి చట్టాలు ఏమీ లేవు. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అటు వెండితెరపైనే కానీ బుల్లితెరపై కానీ లేకుండా పోయింది.మీడియా లో సైతం చిన్నారులు చూడకూడని అభ్యంతరకర వీడియో లు వార్తలు పోస్ట్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా లో ఈ విశృంఖల వీడియో లకు అడ్డు అదుపు లేదు. దాంతో వీటిపై సరైన నియంత్రణ కూడా వుండాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వాటిపై ఆంక్షలు లేకపోతే నేరాలను ప్రేరేపించే ప్రమాదం ఉందని అనేక కేసులు చెప్పకనే చెప్పాయి. వీటిపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని అంతా కోరుకుంటున్నారు.
