Sun Dec 08 2024 08:35:15 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో పూనకాలు.. లీడర్స్ కు లబ్ డబ్
తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. దీంతో నేతల్లో ఆందోళన మొదలయింది
తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలో మొదలయినా మిగిలిన జిల్లాకు కూడా అవి పాకే అవకాశముంది. ఇటు పొత్తులు, అటు అధికార పార్టీలో అసహనం కారణంగా కొందరు టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సమయంలో చేరికలు ఉండాలన్నది చంద్రబాబు భావన. చేరికలతో పార్టీలో జోష్ పెరుగుతుందని, ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన గేట్లు ఎత్తడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు పొత్తుల సందర్భంగా బేరసారాలు ఆడటానికి కూడా చేరికలు లబ్ది చేకూరుస్తాయి. ఇది చంద్రబాబు కోణం.
పొత్తులు ఒకవైపు...
కానీ పార్టీ నేతల పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికే పొత్తులతో ఎవరి సీట్లు గల్లంతవుతాయో చెప్పలేని పరిస్థితి. జనసేనతో దాదాపు పొత్తు ఖరారాయింది. వీరితో పాటు కమ్యునిస్టులను కూడా చంద్రబాబు విస్మరించరు. వీరందరికీ ఎలా లేదన్నా తక్కువలో తక్కువగా యాభై సీట్ల వరకూ త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతల్లో ఇప్పటి నుంచే గాబరా మొదలయింది. జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు కావడంతో ఎక్కడ తమ సీట్లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. పైకి ధీమాగానే కనిపిస్తున్నా నేతల్లో మాత్ర గుబులు మాత్రం ఉండనే ఉంది. ఇక లోకేష్ జాబితా ఎటూ ఉండనే ఉంటుంది. ఆయన ఎవరి పేరు సిఫార్సు చేస్తారోనన్న బెంగ నేతలను వదలిపెట్టడం లేదు.
త్యాగం చేయాలంటే...?
చంద్రబాబు త్యాగం చేయాల్సిందేనని చివరకు అంటే తమ పరిస్థితి ఏంటన్న దిగులు పట్టుకుంది. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ పార్టీలో చేరే వాళ్ల సంఖ్యఎక్కువగా ఉంటుంది. అయితే వారు చంద్రబాబు వద్ద టిక్కెట్ హామీ తీసుకునే కండువా కప్పుకుంటారు. అప్పుడు తమ పరిస్థిితి ఏంటన్న ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తుంది. ఇప్పుడు నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల తెెలుగుదేశం పార్టీ నేతల పరిస్థిితి అదే. ఇన్నాళ్లూ... ఇన్నేళ్లూ తాము కష్టపడి పార్టీ జెండాను పట్టుకుని, క్యాడర్ ను నిలుపుకుంటే వస్తుంటే చివరి నిమిషంలో ఎవరో వచ్చి టిక్కెట్లు ఎగరేసుకుపోవడంపై తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
వచ్చే వాళ్లందరికీ...
వైసీపీ నుంచి వచ్చే వారు నమ్మకంగా ఉంటారన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న కూడా పార్టీ నుంచి వినపడుతుంది. రేపు అరకొర సీట్లు వస్తే తిరిగి వారు వైసీపీ పంచన చేరరన్న ష్యూరిటీ ఏమైనా ఉంటుందా? అని టీడీపీ అభిమానులు సయితం ప్రశ్నిస్తున్నారు. నాయకత్వం ఎప్పుడూ నేతల్లో విశ్వాసాన్ని పాదుగొల్పాలని, క్యాడర్ లో తామున్నామంటూ భరోసా ఇవ్వాలి కాని, ఇతరుల మీద ఆధారపడటం ప్రారంభిస్తే అసలుకే ఎసరు వస్తుందన్న కామెంట్స్ పరోక్షంగా వినపడుతున్నాయి. ఇంకా ఎంతమంది చేరతారో? వారికి సీట్లను సర్దేబాటు ఎలా చేస్తారో? పొత్తులు కుదిరితే తమ పరిస్థితి ఏంటన్నది టీడీపీలో అర్థంకాకుండా ఉంది. పార్టీ కొద్దిగా పుంజుకుంటుందనుకుని ఆనందపడాలా? లేకుంటే సీట్లు వస్తాయో? లేదో? అన్న ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడపాలా? అన్నది లీడర్స్ కు అర్థం కాకుండా ఉంది.
Next Story