Fri Dec 05 2025 14:19:57 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : ఈసారి ఎండలు అదిరిపోతాయట..ముందే రోహిణి కార్తె తరహా ఎండలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతానికి మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. మార్చి నెల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దేశ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధికంగా నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని, తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. మార్చి నుంచి మే నెల వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రోజురోజుకూ...
రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఎక్కువవుతాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈఏడాది ఎండతీవ్రత తో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెబుతున్నారు. గత సీజన్ కంటే ఈ సారి వేసవి చాలా భిన్నమైనదని చెబుతున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు గట్టిగా అంచనా వేస్తున్నారు.
మే నెల మాదిరిగా...
సహజంగా మే నెల రోహిణి కార్తెలో ఎక్కువ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటారు. కాని ఈసారి ఏప్రిల్ నెలలోనే ఈ పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని, నీరు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అలవాట్లు మార్చుకోవాలని చెబుతున్నారు.
Next Story

