Mon Jul 04 2022 06:15:52 GMT+0000 (Coordinated Universal Time)
బాబాయ్ కిఎందుకు అలక..?

ఆత్మకూరు ఉప ఎన్నికకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి జగన్ మండలాల వారీగా మంత్రులను, ముఖ్యనేతలను ఇన్ ఛార్జిలుగా నియమించారు. లక్ష మెజారిటీని సాధించాలన్న లక్ష్యాన్ని వారి ముందు ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మెజారిటీ కోసం స్వేదం చిందిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఏకపక్షమే. టీడీపీ, జనసేన ఇక్కడ బరిలో లేదు. బీజేపీ మాత్రం పోటీ చేస్తుంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇంతవరకూ....
మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమయింది. గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. అయితే ఉదయగిరి ఎమ్మెల్యే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విక్రమ్ రెడ్డికి బాబాయ్ అవుతారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి సోదరుడు. అయితే ఈ ఎన్నికను బాబాయ్ దగ్గరుండి చూసుకోవల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆత్మకూరు నియోజకవర్గంలోకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అడుగుపెట్టలేదు.
పదవి ఆశించారా?
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించిన తర్వాత తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించినట్లు కనపడుతుంది. ఆ కుటుంబంలో సీనియర్ అయిన తనకు పదవి దక్కుతుందని ఆయన భావించినట్లుంది. అయితే జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. మేకపాటి కుటుంబం నుంచి కూడా ఆయనకు పెద్దగా మద్దతు లభించలేదంటారు. ఎమ్మెల్యేగా ఆయన ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ టర్మ్ లో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుటుంబంలో కొంత వీరి మధ్య గ్యాప్ ఏర్పడిందంటున్నారు.
కుటుంబంలో విభేదాలు...
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరుపున ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. హైదరాబాద్ కే ఆయన ఎక్కువ సమయం పరిమితమవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని తెలిసింది. మేకపాటి కుటుంబం కూడా ఆయనను ఆత్మకూరు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించలేదని సమాచారం. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.
మెజారిటీ పైనే...
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1994లో కొమ్మి లక్ష్మినాయుడు గెలిచారు. ఇప్పుడు బరిలో లేదు. పైగా సెంటిమెంట్ తో జరుగుతున్న ఉప ఎన్నిక. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి వాడుగా ఉండేవారు. ఆయన సోదరుడు పోటీ చేస్తుండటంతో ఎన్నిక ఏకపక్షమే. మెజారిటీ ఎంత అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ విషయాలను పక్కన పెట్టి ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం లో కనిపించకపోవడం నియోజకవర్గంలో టాపిక్ గా మారింది.
Next Story