Wed Sep 27 2023 15:45:46 GMT+0000 (Coordinated Universal Time)
ఒకసారి చేతులు కాలాయ్.. మరోసారి పట్టుకుంటారా?
చిరంజీవి తాజాగా చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తు చర్చ జరుగుతుంది

" నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కాని రాజీకీయం నా నుంచి దూరం కాలేదు" ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ట్వీట్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తు చర్చ జరుగుతుంది. ఈ డైలాగ్ వైరల్ గా మారింది. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ డైలాగును చిరంజీవి ట్వీట్ చేశారని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాదు.. కాదు.. ఆయన తిరిగి పునరాలోచనలో పడినట్లుందని మెగా అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు.
కాంగ్రెస్ లోనే...
చిరంజీవి నిజంగానే రాజకీయాలకు దూరం కాలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కేంద్రమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ చిరంజీవి రాజీనామా చేసినట్లు ఎక్కడా వినలేదు. ఆయన కూడా చెప్పలేదు. కాంగ్రెస్ కూడా చిరంజీవి మా వాడే అని చెప్పుకుంటుంది. కానీ కాంగ్రెస్ కార్యకలాపాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. అయితే చిరంజీవి కొంతకాలంగా సినిమాలకే పరిమితమయ్యారు. ఆయన అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.
జనసేనకు...
ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. అయినా 2019 ఎన్నికల్లో తమ్ముడి పక్షాన చిరంజీవి నిలబడలేదు. ఎప్పుడూ ఆయన జనసేనకు నేరుగా తన మద్దతును బహిరంగంగా ప్రకటించలేదు. తన అభిమానులకు ఎటువంటి పిలుపు నివ్వలేదు. కానీ మెగా కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కల్యాణ్ కు నేరుగా మద్దతిచ్చారు. మరోవైపు చిరంజీవి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు నెలల క్రితం భీమవరంలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆయనను శాలువాతో సత్కరించారు.
అందరివాడుగా...
ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా పలు దఫాలు చిరంజీవి కలిశారు. సినిమా ఇండ్రస్ట్రీ కోసమే అయినా జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని బట్టి చిరంజీవి అందరివాడుగానే అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. తాజాగా ఆయన ట్వీట్ చేసింది సినిమా వరకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఒకసారి చేతులు కాల్చుకున్న చిరంజీవి మరోసారి ఆ ప్రయత్నం చేయకపోవచ్చన్నది ఆయనను బాగా తెలిసిన వారు చెబుతున్న మాట. చిరంజీవి రాజీకీయాలకు పూర్తిగా దూరమయినట్లేనని, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉండదని కూడా వారంటున్నారు. అయితే తాజా చిరంజీవి ట్వీట్ మాత్రం రాజకీయంగా చర్చ జరగడానికి ఒక కారణమయిందని మాత్రం చెప్పాలి.
Next Story