Thu Mar 19 2026 02:41:53 GMT+0530 (India Standard Time)
బలహీన పడిన మాండూస్.. ఉప్పెన వచ్చే అవకాశం
తుపాను తీరాన్ని చేసే సమయంలో గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.

బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా ఉన్న మాండూస్.. తుపానుగా బలహీనపడింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను గమనాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు కారైక్కాల్, చెన్నైలోని డాప్లర్ వెదర్ రాడార్లతో పరిశీలిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడి (ఐఎండీ) వెల్లడించింది. వాయవ్య దిశగా పయనించి.. ఈ అర్థరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరి కోటల మధ్య మహాబలిపురంకు సమీపంలో తీరం దాటనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది.
తుపాను తీరాన్ని చేసే సమయంలో గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో తీరంలో అరమీటరు ఎత్తున ఉప్పెన రావొచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక తుపాను ప్రభావంతో..దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ వర్షాలు మొదలయ్యాయి. ఈ నెల 10వ తేదీన చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
Next Story

