ఆంధ్రప్రదేశ్ గోడు వీరికి పట్టదా..?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవిశ్వాస తీర్మానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంపీలు పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతారని, మిగతా పార్టీలు, మిగతా రాష్ట్రాల ఎంపీలు కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడతారని అంతా భావించారు. అయితే, మొదట చర్చను ప్రారభించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్ల అశాస్త్రీయంగా విభజన జరిగిందని, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రాష్ట్రం వెనకబడుతున్న తీరుని వివరించారు. అయితే, ప్రసంగంలో భాగంగా అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరిగిందని వ్యాఖ్యానించడంతో తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఎంపీలే గల్లా ప్రసంగానికి అడ్డుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోని రాహుల్
ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయంపై గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తుందని అంతా భావించారు. అయితే, అవిశ్వాసంపై ప్రసంగం మొదలుపెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం మొదట్లో ఆంధ్రప్రదేశ్ బాధిత రాష్ట్రమని చెప్పినా తర్వాత ఎక్కడా రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. కేవలం మోదీపైన, బీజేపీపైన మాత్రమే ఆయన మాటలదాడి చేశారు. అది కూడా కేవలం దేశానికి సంబంధించిన అంశాలపైనే. ఇక తర్వాత మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కూడా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపైనే మాట్లాడారు. అయితే, ప్రత్యేక హోదా గురించి అబద్ధపు హామీలు వద్దని, అసలు హోదా అంటే ఏంటో చెప్పాలన్నారు. 2019 తర్వాత కూడా ఈ అంశం ఇంకా కొనసాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ గురించి బీజేపీ ఏమి మాట్లాడుతుందనేదే మిగిలి ఉంది.

