Tue Dec 30 2025 22:09:23 GMT+0000 (Coordinated Universal Time)
అనుభవించు బాబూ.. నీవు చూపిన బాటలోనే?
తాను రాజకీయంగా ఎదిగేలా చేసిన నేతలే ఇప్పుడు చంద్రబాబుకు ఆగర్భ శత్రువులుగా మారిపోయారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కుమిలపోవచ్చు. ఆయన ఏడుపుకు కారణమయిన వారు ఆయన స్వయంగా పెంచి పోషించిన నేతలే. తాను రాజకీయంగా ఎదిగేలా చేసిన నేతలే ఇప్పుడు చంద్రబాబుకు ఆగర్భ శత్రువులుగా మారిపోయారు. చంద్రబాబు మనస్తత్వం, పార్టీ లోగుట్టులు తెలిసిన వారే ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశమైంది. చంద్రబాబు స్వయంకృతాపరాధమే ఇప్పుడు ఆయనను వెక్కి వెక్కి ఏడ్చేలా చేసింది.
అనేక మందికి....
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అప్పటికే టీడీపీలో ఉన్న నేతలకు అవకాశాలు కొనసాగించారు. కొందరిని ఫోకస్ చేశారు. పార్టీకి ఉపయోగపడుతున్న నేతలు, నందమూరి కుటుంబం నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు మరికొందరికి రాజకీయంగా అవకాశం కల్పించారు. వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, తమ్మినేని సీతారాం వంటి వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందిగా మారారు.
వంశీకి....
వల్లభనేని వంశీ పరిటాల రవికి శిష్యుడు. ఆ కోణంలోనే ఆయనకు తొలుత విజయవాడ పార్లమెంటు టిక్కెట్, అనంతరం గన్నవరం టీడీపీ టిక్కెట్ లభించాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలే ఇంత దుమారానికి కారణమయ్యాయి. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ మీద గెలిచినా వైసీపీ మద్దతుదారుగా మారిపోయి చంద్రబాబుకు శత్రువుగా మారారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును ఇరుకున పెడుతున్నారు.
నందమూరి ఫ్యామిలీ....
నందమూరి కుటుంబం సిఫార్సుతో కొడాలి నాని గుడివాడ టిక్కెట్ ను దక్కించుకున్నారు. ఆయన జగన్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీకి దూరమయ్యారు. గుడివాడలో వరస విజయాలను సాధిస్తూ టీడీపీని ఆ నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా చేశారు. చంద్రబాబుపై వ్యక్తిగత దాడికి దిగడంలో నాని ముందుంటారు. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వారే. ఇప్పుడు ఆయన వైసీపీలోకి మారి సభలో చంద్రబాబు నోరు నొక్కుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ముగ్గురిని రాజకీయంగా ప్రోత్సహించింది చంద్రబాబే. ఇప్పుడు అనుభవిస్తుంది చంద్రబాబే.
Next Story

