లాలూ ఇంట పెళ్ళి వేడుకల్లో దొంగలు పడి ...?

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి పెళ్లి లో దొంగలు పడ్డారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి బీహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ తో సహా వివిధ పార్టీల అగ్ర నేతలు హాజరయ్యారు. ఇంతమంది విఐపిలు పాల్గొన్న ఈ పెళ్ళిలో దొంగలు సెక్యూరిటీ కన్ను గప్పి విలువైన వంటసామాగ్రిని తస్కరించారు. ఇది ముందే గుర్తించిన మీడియా పై దొంగలు దాడికి పాల్పడి విలువైన కెమెరాలు ఇతర సామాగ్రిని విధ్వంసం చేశారు. మీడియా పెళ్లి నిర్వాహకులకు ఈ విషయం తెలియచెప్పేటప్పటికే దొంగలు తమ పని తాము చక్కబెట్టేశారు.
విందుకు ఏడువేలమంది హాజరు ...
లాలూ కొడుకు పెళ్ళి కావడంతో ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు సుమారు ఏడు వేలమంది అతిధులు హాజరయ్యారు. వీరికి భారీ విందు ఏర్పాట్లు చేసినా వేలమంది అతిధులకు తగ్గ నిర్వహణ ఏర్పాట్లు లేక ఆహ్వానితులకు చుక్కలు కనిపించాయి. అంతపెద్దఎత్తున జరుగుతున్న వేడుక కావడంతో దొంగల ముఠా అక్కడ పాగా వేసింది. అందినకాడికి వంటసామాగ్రిని పధకం ప్రకారం సర్ధేసింది. అది తెలుసుకుని నిర్వాహకులు చూసేటప్పటికే దొంగలు సామానుతో పరారు అయ్యారు. మరోవైపు లాలూ కుమారుడు, కోడలు ఫ్లెక్సీలు వివాదాస్పదం అయ్యాయి. నవదంపతులు శివపార్వతుల రూపంలో ఊరేగింపులో కృష్ణుడి రూపంలో ముద్రించడం విమర్శలకు దారితీసింది. పెళ్ళికి ఎందరు అతిధులు వచ్చినా జైలునుంచి పెరోల్ పై విడుదలై వచ్చిన లాలూ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.
