కోటంరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా?

వైసీపీ ఎమ్మెల్యే నిజంగా తప్పుచేశారా? క్రికెట్ బుకీల కేసులో ఆయన హస్తం ఉందా? లేకుంటే ప్రభుత్వమే వైసీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిందా? ఇదే చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రికెట్ బుకీలతో సంబంధం ఉన్నాయంటూ అప్పుడప్పుడూ వార్తలకెక్కుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో నెల్లూరు జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.
నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ....
అయితే నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, తర్వాత వస్తానని సమాధానం చెప్పిన కోటంరెడ్డి పోలీసుల ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడుగంటల పాటు విచారణ జరిపినపోలీసులు ఆయనను పంపించేశారు. తాజాగా మరోసారి క్రికెట్ బుకీల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క్రికెట్ బుకీలతో సంబంధాలున్నాయని పోలీసు శాఖ నిర్ధారించింది. ఆయనకు క్రికెట్ బుకీలతో ఆర్థిక లావాదేవీలున్నట్లు ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కోటం రెడ్డిపై కేసు నమోదు చేశారు.
బెజవాడ హోటల్ లో....
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రికెట్ బుకీ బాస్ అయిన కృష్ణసింగ్ గ్యాంగ్ తో విజయవాడలోని ఒక ప్రయివేటు హోటల్ లో సమావేశమయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన హోటల్ బిల్లులు, ఫుటేజీని సేకరించారు. కోటంరెడ్డి బస చేసిన హోటల్ బిల్లు రెండు లక్షల రూపాయలు కూడా కృష్ణసింగ్ అనుచరులే చెల్లించినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా కృష్ణసింగ్ పోలీసులు కన్నుగప్పి దాక్కోవడానికి కూడా కోటంరెడ్డి సహకరించారంటున్నారు. ఇందుకు సంబంధించి కృష్ణసింగ్ విష్ణువర్థన్ రెడ్డి ద్వారా 23 లక్షలు కోటం రెడ్డికి అందజేసినట్లు కూడా ఆధారాలను సేకరించారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఈ డబ్బు కోటంరెడ్డికి అందజేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కల్పిత కథ అంటున్న....
‘‘మూడు, ఆరు నెలలకు ఒకసారి ఇది మామూలే. తనకు నోటీసులివ్వడం, తనపై కేసులు నమోదు చేస్తానని చెప్పడం గత కొన్ని రోజులుగా జరుగుతుంది’’ అని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. తనను తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అయినా అన్నింటినీ దాటుకుని చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన అంటున్నారు. తనకు సంబంధం లేనికేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని, అయితే ప్రజలు ఇది గమనిస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. తాను దీనిపై న్యాయపోరాటంతో పాటు ధర్మపోరాటం చేస్తానని చెప్పారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా తాను పోలీసులను ఎలా మేనేజ్ చేస్తానని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తనకు సహకరించిన పోలీసు అధికారులపై కూడా కేసు నమోదు చేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఫేక్ అని, కావాలనే, తనను బద్ నామ్ చేయడానికే ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తుందంటున్నారు కోటంరెడ్డి.మరి ఏది నిజం? ఏది అబద్ధం?
