కేసీఆర్ ను కలవరపెడుతున్నదెవరంటే?

"పక్షిలా దేశమంతా చుట్టేసి రాజకీయ ప్రక్షాళన చేస్తా. బిజెపి కాంగ్రెస్ లేని రాజకీయం తెస్తా అంటూ ప్రకటనలు చేసిన తెలంగాణ సీఎం కు షాక్ లు తగులుతున్నాయి. ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఇంకా పని ప్రారంభించకుండానే కలిసిన వారంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అనడం టి బాస్ ను కలవరపాటుకు గురిచేస్తుంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం ముందు కలిసిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సైతం కాంగ్రెస్ జపం వీడక పోవడంతో తన ఫ్రంట్ లో చివరికి తానే మిగులుతారా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్, బిజెపి పెత్తనం లేని పాలన దేశ వాసులకు రుచి చూపిస్తా అన్న కేసీఆర్ మాటలను ఆచరణలో అమలు అయ్యే ఛాన్స్ లు క్రమంగా తగ్గుముఖం పట్టేలా ఉన్నాయి.
ఇక బాబును కలుపుకుని ...
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలో కానీ మమతా బెనర్జీని కలిసి వచ్చిన తరువాత కానీ కేసీఆర్ కి పక్క తెలుగు రాష్ట్రం చంద్రబాబు గుర్తుకు రాకపోవడం విమర్శలు ఎక్కుపెట్టేలా చేసింది. చివరికి మాజీ ప్రధాని దేవగౌడను కలిసి డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయ్యాక కానీ చంద్రబాబు పేరు ఎత్తలేదు టి బాస్. ఫెడరల్ ఫ్రంట్ బలపడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం బాబుతోను కలిసి పనిచేస్తా అన్నారు కేసీఆర్. తాను వెళ్ళి ఫ్రంట్ లోకి చంద్రబాబు ను ఆహ్వానిస్తా అన్నారు ఆయన. టిడిపి అధినేత బాబు తన కొలీగ్ అని తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు కేసీఆర్.
బాబు కలుస్తారా ...?
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎపి సీఎం చంద్రబాబు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి. మర్యాదపూర్వకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినా వీరిద్దరూ చివరి వరకు కలిసి ప్రయాణించడం అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన చేతికి 25 ఎంపీ సీట్లు ఇస్తే తడాఖా చూపిస్తా అని ప్రచారం మొదలు పెట్టిన ఎపి సీఎం ఎన్నికల తరువాత పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో వైఎస్ ను ఎదుర్కొనేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 లోనే బాబు కేసీఆర్ ను మహా కూటమిలో కలుపుకుని చంద్రబాబు ఎన్నికల బరిలోకి దిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చంద్రులిద్దరు కలిస్తే ప్రయోజనం లేదని ఆనాటి ఫలితాలు చెప్పకుండా చెప్పిన నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ మొదలు పెట్టిన కొత్త రాజకీయ ఎపిసోడ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తికరం.
- Tags
- andhra pradesh
- chennai
- chief minister
- hyderabad
- indian national congress
- k chandrasekhar rao
- karunanidhi
- nara chandrababu naidu
- stallin
- telangana
- telugudesam partay
- trs
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కరుణానిధి
- కె. చంద్రశేఖర్ రావు
- చెన్నై
- టీఆర్ఎస్
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- ముఖ్యమంత్రి
- స్టాలిన్
- హైదరాబాద్